Reading Time: 2 minutes

ఎకరాకు 13 లక్షలున్న జాగాకు  ఇచ్చింది 2 లక్షలే!

Caption of Image.
  • రంగనాయక సాగర్ పేరిట 
  • భూములుకొని అగ్గువకు 
  • దక్కించుకున్న హరీశ్​రావు
  • రెండు సర్వే నంబర్లకూ ఒకే ఎన్వోసీ
  • ప్రైవేటుకు మారిన ప్రభుత్వ భూమి
  • సిద్దిపేట జిల్లాలోని మాజీ మంత్రి భూముల్లో కాంగ్రెస్ ఎంపీలు, 
  • ఎమ్మెల్సీల బృందం పరిశీలన 

సిద్దిపేట/కొండపాక, వెలుగు: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులోని 271 సర్వే నంబర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్ సమీపంలో ఉన్న హరీశ్​రావు వ్యవసాయ భూములను కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులతో ఆయా ప్రదేశాల మ్యాప్ లను పరిశీలించి భూములు, కొనుగోలు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు చామల కిరణ్ కుమార్​ రెడ్డి, మల్లు రవి మాట్లాడుతూ వెలికట్ట వద్ద 131 సర్వే నంబర్​లోని భూమికి సంబంధించిన ఎన్వోసీని 271 సర్వే నంబర్​ భూమికి వర్తింపజేశారని ఆరోపించారు. ఎన్వోసీ జారీ కోసం వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పత్రాలను చూపించారని పేర్కొన్నారు. వెలికట్ట గ్రామంలోని 271 సర్వే నంబర్​లో ఉన్నది ప్రభుత్వ భూమి అని, గతంలో స్వాతంత్ర్య సమరయోధులు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు దీన్ని కేటాయించారని తెలిపారు. అలాంటి భూమి ప్రైవేట్ వ్యక్తుల పేర్లపైకి ఎలా మారిందో విచారించాలని అధికారులను ఆదేశించారు. వెలికట్టలోని 6.3 ఎకరాల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగిందని, దాన్ని అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలన్నారు. 

వాస్తవాల్ని నిగ్గు తేల్చడానికి క్షేత్ర స్థాయి పరిశీలన..

బీఆర్ఎస్​లీడర్ల భూదోపిడీ గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించారని, ఆ నిజాలను నిగ్గు తేల్చడానికి తాము క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చామని మల్లు రవి, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామ సమీపంలోని రంగనాయక సాగర్  వద్ద హరీశ్​రావు వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి అధికారులతో మాట్లాడి మ్యాప్ లను పరిశీలించారు.రంగనాయక సాగర్ నిర్మించే సమయంలో ప్రభుత్వం ఎకరానికి ఆరు లక్షల నుంచి రూ.13 లక్షల వరకు పరిహారం ఇస్తే హరీశ్ రావు కేవలం రూ.2 లక్షలకే ఎకరం ఎలా కొన్నారని, దీనిపై ఈడీ దర్యాప్తు చేయాలని డిమాండ్​చేశారు.ప్రజలే లేని చోట పది ఎకరాల్లో సుడా పార్కు నిర్మించడంపై అనుమానాలున్నాయన్నారు. పార్క్ కోసం ఇరిగేషన్ శాఖ ద్వారా రూ.5.35 కోట్లతో రోడ్డు కూడా వేశారన్నారు. జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ వద్దకు సైతం వెళ్తామని చెప్పారు.

ఇరిగేషన్ శాఖ భూమిని సుడాకు ఇవ్వడం, రంగనాయక సాగర్ భూములను హరీశ్​రావు తక్కువ ధరకే కొనడంపై విచారించాలని అధికారులకు సూచించారు. పర్యటనలో ఎంపీలు బలరామ్ నాయక్, సురేశ్ షెట్కర్, వేం నరేందర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు దయాకర్, వెంకట్, డీసీసీ ప్రెసిడెంట్​ఆంక్షరెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీల బృందం వెలికట్ట, చంద్లాపూర్ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

‘కల్వకుంట్ల’ దోపిడీ బయటపెట్టేందుకే : వంశీకృష్ణ

 నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రాణాలు త్యాగం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని తెచ్చుకున్నామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం దందాలు, కబ్జాలు చేసి కడుపులు నింపుకున్నదని మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలతో సిద్దిపేటకు వెళ్లేముందు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం దోపిడీ, అరాచకాలు బయటపెట్టేందుకే సిద్దిపేటకు వెళ్తున్నామన్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున బయల్దేరామన్నారు. పదేండ్లు అక్రమంగా ప్రజల సొమ్ము తిన్న కల్వకుంట్ల కుటుంబ కథ అంతా బయటపెడతామని వెల్లడించారు. పదేండ్లు కేటీఆర్ ఐటీ మినిస్టర్ గా ఉండి తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. 
 

©️ VIL Media Pvt Ltd.