
ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన పండ్లలో అరటిపండు ఒకటి. శరీరానికి అవసరమైన విటమిన్లు, పొటాషియం, ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. అయితే చాలామందికి ఉదయాన్నే పరగడుపున అరటిపండు తినవచ్చా? అనే సందేహం ఉంటుంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం కలసిరాక ఉదయం పూట కేవలం అరటిపండుతో సరిపెట్టేవారు చాలామంది ఉన్నారు. అయితే పరగడుపున దీనిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే ముప్పు, నిపుణులు సూచించే సరైన విధానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఉదయం పూట లభించే ప్రయోజనాలు
తక్షణ శక్తి: అరటిపండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజమైన చక్కెరలు ఉంటాయి. ఇవి ఉదయాన్నే శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందించి, రోజంతా ఉత్తేజంగా ఉండేందుకు తోడ్పడతాయి.
జీర్ణక్రియ మెరుగుదల: దీనిలోని పీచు పదార్థం జీర్ణక్రియను వేగవంతం చేసి, మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది.
పరగడుపున తింటే ఎదురయ్యే ముప్పు
అరటిపండు మంచిదే అయినప్పటికీ, ఖాళీ కడుపుతో తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులు: ఖాళీ కడుపుతో అరటిపండు తిన్నప్పుడు శరీరంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ తర్వాత అంతే వేగంగా పడిపోవడం వల్ల మళ్ళీ నీరసం లేదా అలసట ఆవరిస్తుంది. అందువల్ల మధుమేహ బాధితులు, బరువు తగ్గాలనుకునేవారు పరగడుపున దీనికి దూరంగా ఉండాలి.
పొటాషియం అసమతుల్యత: అరటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి, గుండె, బిపి సమస్యలు ఉన్నవారిలో అసౌకర్యానికి దారితీయవచ్చు.
గ్యాస్, ఎసిడిటీ: సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు ఖాళీ కడుపుతో అరటిపండు తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
అరటిపండు తినడానికి సరైన మార్గం ఏది?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటిపండును ఎప్పుడూ ఖాళీ కడుపుతో ఒక్కటే తినకూడదు.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పూర్తయిన తర్వాత అరటిపండు తినడం సురక్షితం.
ఒకవేళ ఉదయమే తీసుకోవాలనుకుంటే, దానిని ఓట్ మీల్, పాలు, డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్‌తో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ప్రొటీన్లు, ప్రయోజనకరమైన కొవ్వులు, ఫైబర్ సమతుల్యంగా అందుతాయి.
సరైన విధానంలో, తగిన మోతాదులో అరటిపండును ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు!