
- అసంఘటిత రంగంలో 78 శాతం మంది మహిళలు
- టాప్ 5లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు
- వ్యాపారాలకూ మహిళలే ఓనర్లు.. నిర్మల్‌లో 80 శాతం సంస్థలు వారివే..
- తొలిసారి 757 జిల్లాల డేటా విడుదల చేసిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు : దేశంలోని అసంఘటిత రంగ శ్రామికశక్తిలో ఉత్తర తెలంగాణ మహిళలు చరిత్ర సృష్టించారు. వ్యవసాయేతర, అసంఘటిత రంగాల్లో మగవాళ్లను మించి ఉపాధి రంగంలో దూసుకెళ్తున్నారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మొత్తం శ్రామికుల్లో 78 శాతం మంది మహిళలే కావడం విశేషం. దేశచరిత్రలోనే తొలిసారిగా 757 జిల్లాల వారీగా అసంఘటితరంగ డేటాను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ‘యాన్యువల్ సర్వే ఆఫ్ అన్‌ఇన్ కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో విడుదల చేసింది. బీడీ తయారీ, చేనేత, హస్తకళలు, ఆహార శుద్ధి, చిన్న తరహా వ్యాపారాలు, సర్వీస్ సెక్టార్లలో మహిళల ప్రాతినిధ్యం అధికంగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
టాప్ 5 లో మూడు తెలంగాణ జిల్లాలే…
దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో మహిళా కార్మికుల ప్రాతినిధ్యంలో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల హవా కొనసాగుతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టాప్ -5 జిల్లాల జాబితాలో తెలంగాణకు సంబంధించిన మూడు జిల్లాలు చోటు దక్కించుకుని జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ జాబితాలో 78 శాతం మహిళా కార్మికులతో నిర్మల్ జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలువగా.. 70 శాతంతో మణిపూర్‌కు చెందిన ఇంఫాల్ ఈస్ట్ రెండో స్థానాన్ని, 70 శాతంతో తెలంగాణలోని నిజామాబాద్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో 69 శాతంతో జగిత్యాల నాలుగో ర్యాంకు, 66 శాతంతో మణిపూర్‌లోని బిష్ణుపూర్ ఐదో ర్యాంకులో నిలిచింది.
ఓనర్లూ వాళ్లే.. వర్కర్లూ వాళ్లే..
నిర్మల్ జిల్లా కేవలం కార్మికుల సంఖ్యలోనే కాకుండా సూక్ష్మ, చిన్న తరహా సంస్థల యాజమాన్యంలోనూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. జిల్లాలోని అసంఘటిత రంగ యూనిట్లలో దాదాపు 80 శాతం సంస్థలకు మహిళలే పూర్తి స్థాయి యజమానులుగా ఉన్నారు. ఒకే జిల్లాలో వ్యాపారాల నిర్వహణ, శ్రామిక శక్తి రెండింటిలోనూ మహిళలు పట్టు సాధించడం దేశంలో మరెక్కడా నమోదు కాలేదు.
ఇదే సమయంలో పక్కనే ఉన్న సరిహద్దు జిల్లాల మధ్య వ్యత్యాసాన్ని సైతం నివేదిక వెలుగులోకి తెచ్చింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా తొలి ర్యాంకులో నిలిస్తే.. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మహిళా కార్మికుల భాగస్వామ్యం కేవలం 31 శాతంగానే నమోదైంది. దీంతో నాందేడ్ జాతీయస్థాయిలో 288వ స్థానానికి పడిపోయింది. 50 శాతానికిపైగా ఉన్న ‘ఎలైట్ క్లబ్’లో దేశవ్యాప్తంగా ఉన్న 757 జిల్లాల్లో మహిళా వర్క్‌ఫోర్స్ 50 శాతానికి పైగా నమోదైన జిల్లాలు 25 మాత్రమే ఉన్నాయి. ఇందులో 22 జిల్లాలు దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల నుంచే ఉండగా.. మిగిలిన మూడు జిల్లాలు ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవి. ఈ అరుదైన టాప్- 25 జిల్లాల జాబితాలో ఉత్తర తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు నిలిచాయి. తెలంగాణతో పాటు మణిపూర్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో మహిళా భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర నివేదికలో ప్రకటించింది.
వేతనాల్లో మాత్రం నిరాశే…
అసంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం రికార్డు స్థాయిలో ఉన్నా.. వేతనాల చెల్లింపుల్లో మాత్రం తీవ్ర వ్యత్యాసం కొనసాగుతోంది. ఎక్కువ శ్రమ పడుతున్నా ఆదాయం తక్కువగానే లభిస్తోంది. మహిళా వర్క్‌ఫోర్స్ 50 శాతానికి పైగా ఉన్న టాప్ -25 జిల్లాలను పరిశీలిస్తే.. మేఘాలయలోని సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోనే కార్మికులకు అత్యధికంగా ఏడాదికి సగటున రూ.1.7 లక్షల వేతనం అందుతోంది. జాతీయ సగటు రూ.1.3 లక్షల కంటే ఎక్కువ. మరోవైపు.. మహిళల భాగస్వామ్యం కేవలం 19 శాతంగా ఉన్న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో సగటు వార్షిక వేతనం రూ.4.6 లక్షలుగా ఉండడం
గమనార్హం.
అట్టడుగున రుద్రప్రయాగ
దేశంలోనే అత్యల్పంగా మహిళా శ్రామిక భాగస్వామ్యం ఉన్న జిల్లాగా ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ నిలిచింది. ఇక్కడ మహిళా కార్మికులు 6.7 శాతం మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత అసోంలోని మరిగావ్ 9 శాతం, గుజరాత్‌లోని బనస్కాంత 11 శాతం, యూపీలోని హథ్రాస్ 11 శాతం, జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ 11 శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి. కాగా, మొత్తం కార్మికులు, సంస్థల సంఖ్య పరంగా పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలు జిల్లా 21.3 లక్షల మంది కార్మికులు, 16.6 లక్షల సంస్థలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక వ్యవస్థలోని స్థూల విలువలో టాప్- 50 జిల్లాలు ఏకంగా 33 శాతం వాటాను కలిగి ఉన్నట్లు కేంద్ర నివేదిక స్పష్టం చేసింది.