
- డాక్టర్ రెడ్డీస్, టకెడా ఫార్మా కీలక ఒప్పందం
న్యూఢిల్లీ: భారతదేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ను అమ్మేందుకు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జపాన్‌కు చెందిన టకెడా ఫార్మాస్యూటికల్స్‌తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. టకెడా ఫార్మా ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసి, అభివృద్ధి చేసిన అసలైన కంపెనీ. డాక్టర్ రెడ్డీస్ భారతదేశంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు, ఫార్మసీలకు అమ్ముతుంది.
ఒకవేళ భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా తమ ప్రభుత్వ ఆసుపత్రులు, ఉచిత వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ల కోసం కొనుగోలు చేయాలనుకుంటే… ఆ పబ్లిక్ మార్కెట్ హక్కులు టకెడా ఫార్మా వద్దే ఉన్నాయి. ఈ ఏడాది జులైలోనే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నుంచి మార్కెటింగ్ అనుమతి పొందిన క్యూడెంగా వ్యాక్సిన్, 2027 మొదటి ఆరు నెలల్లో రోగులకు అందుబాటులోకి రానుంది.
ఈ వ్యాక్సిన్‌ను 4 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వారికి ఇవ్వవచ్చు. డెంగ్యూలోని మొత్తం నాలుగు రకాల సెరోటైప్స్‌పై సమర్థంగా పనిచేస్తుంది. మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఈ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లో ఆమోదం పొంది, 3.2 కోట్ల డోసులు అమ్ముడైన ఈ వ్యాక్సిన్, భారత్‌లో డెంగ్యూ నియంత్రణకు కీలకమని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రకటించింది.