Reading Time: 2 minutes
Marathi Film Gondhal Becomes Indias Official 2027 Oscar Entry

Gondhal: మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘గోంధళ్’ (Gondhal) 2027లో జరగనున్న 99వ ఆస్కార్ అవార్డుల కోసం ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా, దేశవ్యాప్తంగా వివిధ భాషల నుండి పోటీ పడిన మొత్తం 33 సినిమాలను వెనక్కి నెట్టి మరాఠీ ‘గోంధళ్’ సినిమా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. సంతోష్ దావఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యం, అక్కడి సంప్రదాయ ఆచారం చుట్టూ సాగే అద్భుతమైన కథాంశంతో రూపొందగా, 2027 మార్చి 14న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లలో జరగబోయే ప్రధాన వేడుకలో ఇది భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.

ఈ కథ కూడా చాలా ఇంటెన్స్ గా సాగుతుంది. ఆస్కార్ రేసులో నిలిచిన ‘గోంధళ్’ ఒక రాత్రి జరిగే సాంప్రదాయ పూజా ఆచారం బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్రిప్పింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో నూతన వధూవరుల జీవితాల బాగు కోసం రాత్రంతా నిర్వహించే ‘గోంధళ్’ అనే జానపద దైవిక పూజ జరుగుతుండగా, తెరవెనుక ఒక ప్రమాదకరమైన హత్యకు కుట్ర నడుస్తుంది. సుమన్ (ఇషితా దేశ్‌ముఖ్) అనే యువతి తనకు ఇష్టం లేని భర్త ఆనంద్ (యోగేష్ సోహోని) ని హతమార్చడానికి తనపై వ్యామోహంతో ఉన్న ఊరి ప్రెసిడెంట్ కొడుకును వాడుకుని, ఆ నేరాన్ని అతనిపై నెట్టి తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోవాలని ప్లాన్ చేస్తుంది. ఒకవైపు దైవికమైన మంత్రాలు, డప్పు చప్పుళ్లతో పూజ సాగుతుండగా, మరోవైపు ఈ క్రూరమైన మైండ్ గేమ్‌లో భర్త ఆనంద్ ఎలాంటి ప్రతికారం తీర్చుకున్నాడు?  ఆ రాత్రి కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఈ సినిమా ఉత్కంఠభరితమైన అసలు కథ.

‘గోంధల్’లో ఇషితా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో నటించారు. కిషోర్ కదమ్, యోగేష్ సోహాని, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. 2025లో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా ‘గోంధల్’ ప్రదర్శించగా, దర్శకుడు సంతోష్ దావఖర్ బెస్ట్ డైరెక్టర్‌గా సిల్వర్ పీకాక్ అవార్డును అందుకున్నారు. ఆస్కార్ ఎంట్రీ కోసం ఈసారి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు మొత్తం 33 సినిమాలు వచ్చాయి. వాటిలో 14 హిందీ సినిమాలు, నాలుగు మరాఠీ సినిమాలతో పాటు తెలుగు, తమిళం, గుజరాతీ తదితర భాషల సినిమాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని వెనక్కి నెట్టి ‘గోంధల్’ కి ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం.