Reading Time: < 1 minute
Tummala Nageswara Rao Key Comments Khammam Development Politics

ఖమ్మం జిల్లాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అభివృద్ధి, ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని, పదవుల కోసం ఎప్పుడూ ఎవరినీ అడగలేదని ఆయన స్పష్టం చేశారు.

అభివృద్ధి నా నైజం.. రాజకీయాలు చేయను

తాను రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ రాజకీయాలు చేయాలని అనుకోలేదని తుమ్మల తెలిపారు. “నాకు పదవి కావాలని ఏనాడూ ఎవరినీ అడగలేదు. గతంలోనూ, ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఖమ్మం కావాలని కోరుకోలేదు. ఏ పార్టీని వ్యతిరేకించడం గానీ, ధిక్కరించడం గానీ నా ఉద్దేశం కాదు. నిరంతరం పని చేసే ముఖ్యమంత్రికి అండగా నిలవడమే నా బాధ్యత. మీరు ఓటు వేస్తారనే ఆశతో నేను ఈ రోడ్డు వేయడం లేదు. నన్ను గెలిపించిన మీ ఋణం తీర్చుకోవడానికే పనులు చేపడుతున్నాను” అని పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనూ అడిగి నిధులు తెచ్చానని గుర్తుచేశారు.

శాంతిభద్రతల విషయంలో కఠినం

ఖమ్మంలో మంచినీటి సమస్యకు పరిష్కారంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.250 కోట్లు ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రాంతం అభివృద్ధి చెందాలంటే దౌర్జన్యాలు, భూకబ్జాలు ఉండకూడదని, లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలని హెచ్చరించారు. అధికార పార్టీ నాయకులు తప్పు చేసినా కప్పిపుచ్చే ప్రసక్తే లేదని, తప్పు చేసిన వారిని కాపాడటానికి తాను ఏనాడూ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేయలేదని తేల్చిచెప్పారు.