Reading Time: 2 minutes
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 9 నెలలు ఫుల్ బిజీ.. టీమిండియా షెడ్యూల్ చూస్తే ఎగిరి గంతేస్తారంతే..!

Team India Schedule 2026 to 2027: ఐపీఎల్ 2026 ధనాధన్ ముగిసిందో లేదో, అప్పుడే మన బ్లూ జెర్సీ వీరులు అంతర్జాతీయ పోరాటాలకు సిద్ధమయ్యారు. సరికొత్త లక్ష్యాలు, సరికొత్త సవాళ్లతో భారత క్రికెట్ జట్టుకు రాబోయే ఏడాది కాలం అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు 2027 వన్డే ప్రపంచకప్ సాధించడమే పరమావధిగా టీం ఇండియా ముంగిట ఉన్న ఆ అద్భుతమైన, ఊపిరి సలపని షెడ్యూల్ విశేషాలు మీకోసం.

టార్గెట్ @ 2027 ప్రపంచకప్..

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ హడావుడి నుంచి ఆటగాళ్లు కోలుకోకముందే అంతర్జాతీయ సమరానికి ఐసీసీ నగారా మోగించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే భారత జట్టు మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతోంది. రాబోయే కాలంలో టీం ఇండియా కేవలం ద్వైపాక్షిక సిరీస్‌లకే పరిమితం కాకుండా, ఆసియా కప్, బోర్డర్-గావస్కర్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో తలపడనుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారత్ ఆడబోయే మ్యాచ్‌ల పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

సొంతగడ్డపై అఫ్ఘాన్ సవాల్‌తో శ్రీకారం..

భారత జట్టు తన జూన్ నెలను అఫ్ఘానిస్తాన్‌తో ప్రారంభించనుంది. జూన్ 6 నుంచి జూన్ 20 వరకు సొంతగడ్డపై అఫ్ఘానిస్తాన్‌తో ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే జూన్ చివరి వారంలో ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లి అక్కడ మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జులై 1 నుంచి జులై 19 వరకు ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న మన జట్టు అక్కడ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది.

ఇది కూడా చదవండి: తోపులుగా వచ్చి తుస్సుమన్న ఐదుగురు.. పద్ధతిగా రిటైర్మెంట్‌ చేస్తే పరువైనా మిగిలేనుగా..!

బిజీ బిజీ సెప్టెంబర్..

సెప్టెంబర్ నెల భారత జట్టుకు మరింత పరీక్షా సమయం కానుంది. సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ వెంటనే యూఏఈ వేదికగా అఫ్ఘానిస్తాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఇదే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్‌లో భారత జట్టు టీ20 ఫార్మాట్‌లో బరిలోకి దిగనుంది.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ..

అక్టోబర్‌లో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది (మూడు వన్డేలు, ఐదు టీ20లు). అక్టోబర్-నవంబర్ నెలల్లో టీం ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. డిసెంబర్-జనవరిలో శ్రీలంక జట్టు భారత్‌కు రానుంది. జనవరి 3 నుంచి 7 వరకు జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ముగిసిన వెంటనే, అత్యంత ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. జనవరి-ఫిబ్రవరి నెలల్లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించి ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

ఇది కూడా చదవండి: Video: ఆర్సీబీకి దిమ్మతిరిగే షాక్.. స్టార్ ప్లేయర్‌పై నిషేధంతోపాటు జరిమానా..!

2027 ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్‌లో ప్రతిష్టాత్మక ‘ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్’ (WTC) ఫైనల్ జరగనుంది. ఆ తర్వాత జులైలో వన్డే ఫార్మాట్‌లో ‘ఆసియా కప్’ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక అన్నింటికన్నా కీలకమైన ‘2027 వన్డే ప్రపంచకప్’ అక్టోబర్-నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..