Reading Time: < 1 minute
Aiadmk Crisis Deepens Eps And Velumani Factions Meet Tamil Nadu Speaker Separately

AIADMK Crisis: తమిళనాడులో మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించలేకపోయినా.. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ సహా ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు టీవీకే అధినేత విజయ్‌.. ఇక, అసెంబ్లీలో విజయ్‌ సర్కార్‌ బలనిరూపణ సమయంలో అనూహ్యంగా కొంత మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కు పద్దతు ప్రకటించారు.. దీంతో, ఆ పార్టీలో విభేదాలు ఉన్నాయనేది స్పష్టమైంది.. అయితే, అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు మరింత ముదురుతోంది. గత పది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు పార్టీని రెండు వర్గాలుగా చీల్చేశాయి. పార్టీ నాయకత్వంపై ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా రెండు శిబిరాలుగా విడిపోయి బహిరంగంగా తమ బలం ప్రదర్శించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) నాయకత్వంలో ఒక వర్గం కొనసాగుతుండగా, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఆధ్వర్యంలో మరో వర్గం ఏర్పడింది. ఈపీఎస్‌కు మాజీ మంత్రి కేసీ వీరమణి మద్దతు ప్రకటించడం రాజకీయ పరిణామాలకు మరింత వేడి తెచ్చింది. తమ వర్గానికే పార్టీపై పూర్తి అధికారం ఉందని ఇరు వర్గాలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని సచివాలయంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను రెండు వర్గాల నేతలు విడివిడిగా కలిశారు. తమ వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్పీకర్‌కు వివరించారు. ఈపీఎస్ వర్గం తరఫున 22 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారని పేర్కొనగా, వేలుమణి వర్గం తమకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేసింది.

ఇక, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ను మాత్రమే గుర్తిస్తామని మాజీ మంత్రి కేసీ వీరమణి ప్రకటించారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎస్పీ వేలుమణి వర్గాన్ని పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఈపీఎస్ వర్గం వెల్లడించింది. దీంతో అన్నాడీఎంకేలో రాజకీయ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది.. పార్టీలో నెలకొన్న ఈ అంతర్గత సంక్షోభం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలపై కీలక ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల బలం, పార్టీ గుర్తింపు, నాయకత్వ వివాదం తదితర అంశాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.