Reading Time: < 1 minute
Mumbai Indians 50000 Runs T20 Record Csk Vs Mi Ipl

Mumbai Indians Create History: ఐపీఎల్​లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ పరిస్థితి ఈ సీజన్‌లో దారుణంగా మారింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. అయితే.. ఈ పరాజయంలోనూ ముంబై ఇండియన్స్ ఓ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. టీ20 క్రికెట్ చరిత్రలో 50,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అరుదైన ఘనత సాధించడానికి ముంబైకి ఈ మ్యాచ్‌లో 114 పరుగులు అవసరం కాగా, 15వ ఓవర్లో ఆ మైలురాయిని చేరుకుంది.

ముంబై ఇండియన్స్‌కు ఇది 308వ టీ20 మ్యాచ్ (286 ఐపీఎల్ మ్యాచ్‌లు, 22 ఛాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్‌లు). టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ముంబై తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన సోమర్‌సెట్ (48,244 పరుగులు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (47,304 పరుగులు), చెన్నై సూపర్ కింగ్స్ (46,438 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మ (6,286 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (3,933), కీరన్ పొలార్డ్ (3,915) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

అయితే, ఈ చారిత్రాత్మక రికార్డు ముంబైకి తీపి జ్ఞాపకాన్ని మిగిల్చినా, మ్యాచ్ ఫలితం మాత్రం చేదుగా మారింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 18.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ (67), కార్తీక్ శర్మ (54) అర్ధసెంచరీలతో చెన్నైకి విజయాన్ని అందించారు. ఈ ఓటమితో ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబైకి ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. ప్రస్తుతం 8 మ్యాచ్‌లలో కేవలం 4 పాయింట్లతో ఉన్న ముంబై, మిగిలిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే గరిష్టంగా 16 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉండేది. కానీ చెన్నై చేతిలో ఓటమితో ఇప్పుడు ముంబై గరిష్టంగా 14 పాయింట్లను మాత్రమే సాధించగలదు, ఇది ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి సరిపోదు.