Reading Time: < 1 minute

సభ గౌరవాన్ని కాపాడడానికే ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాం : గౌరవ్ గొగోయ్

Caption of Image.

ఈరోజు (మార్చ్ 10) లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాపై చర్చను ప్రారంభిస్తూ గౌరవ్ గొగోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్మానం ఎవరినో వ్యక్తిగతంగా విమర్శించడానికి కాదని, పార్లమెంటు నిలబెట్టిన విలువలను కాపాడడానికేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నప్పుడు మైక్రోఫోన్‌లను ఆపేస్తున్నారని, ఇది వారి గొంతు నొక్కడమేనని గొగోయ్ ఆరోపించారు.

 లోక్‌సభలో ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ ముఖ్యమైన విషయాలపై మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ పదే పదే అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, చైనా సరిహద్దు ఘర్షణల గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం 20 సార్లు అంతరాయం కలిగించారని గుర్తు చేశారు.

మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవాణే పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా, సైన్యానికే వదిలేయడంపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలను అడ్డుకోవడం సరికాదన్నారు.

వాణిజ్య ఒప్పందాల విషయంలో ప్రభుత్వంపై ఎవరి ఒత్తిడి ఉంది?  ఎప్స్టీన్ ఫైల్స్  వంటి అంశాల వల్ల ప్రభుత్వం భయపడుతోందా ? అని గొగోయ్ ప్రశ్నించారు. స్పీకర్ అనే వ్యక్తి మొత్తం సభకు, రాజ్యాంగ నైతికతకు కాపలాదారుగా ఉండాలని, అందరినీ సమానంగా చూడాలని ఆయన కోరారు.

చివరగా, ఎంతో బాధతోనే ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే మా ఉద్దేశమని గొగోయ్ అన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.