Reading Time: < 1 minute

LPG సిలిండర్ల సరఫరాపై కీలక నిర్ణయం.. HPCL పెద్ద ప్రకటనే చేసిందిగా..!

Caption of Image.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో.. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్స్ నడపలేమని ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో హోటల్స్ అసోసియేషన్స్ ఇప్పటికే ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది.

LPG సిలిండర్లను గృహ వినియోగదారులకు, అత్యవసర సేవలు అందించే ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించినట్లు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్స్ ఇతర రంగాల నుంచి వచ్చే అభ్యర్థనలను చమురు మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ సమీక్షిస్తుందని స్పష్టం చేసింది. ఇతర రంగాలకు గ్యాస్ సరఫరా చేసే విషయంలో.. అవసరం, లభ్యత, ప్రాధాన్యత ఆధారంగా ఆలోచన చేస్తామని HPCL తెలిపింది.

ఇదిలా ఉండగా.. ఇరాన్ యుద్ధంతో  ముంచుకొస్తున్న ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, దేశంలో వంట గ్యాస్ (ఎల్పీజీ) అక్రమ నిల్వలను అరికట్టేందుకు రీఫిల్ సిలిండర్ల బుకింగ్ గడువును కేంద్రం పెంచింది. ఇప్పటిదాకా ఒక సిలిండర్ పొందిన 21 రోజుల తర్వాత మరో సిలిండర్ బుకింగ్‌‌‌‌కు అవకాశం ఉండేది. దాన్ని ఇప్పుడు 25 రోజులకు పెంచుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరాపై అనిశ్చితి ఏర్పడిన  నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, ప్రస్తుతం దేశంలో ఇంధన కొరత లేదని.. ప్రజలు భయాందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

©️ VIL Media Pvt Ltd.