Reading Time: < 1 minute

స్త్రీనిధిలో నిబంధనలకు పాతర!

Caption of Image.
  • మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా 14 ఏండ్ల నుంచి ఒకే వ్యక్తి 
  • రిటైరైనా పైరవీలతో పదవీ కాలాన్ని పొడిగించుకుంటున్న విద్యాసాగర్ రెడ్డి
  • మేతో పదవి గడువు ముగింపు.. మరోసారి రెన్యువల్‌‌కు ప్రయత్నాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్యలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఒక అధికారి ఒకే పోస్టులో గరిష్టంగా ఎంతకాలం ఉండాలనే నిబంధనలు ఇక్కడ అమలు కావడం లేదు. ఏకంగా 14 ఏండ్లుగా ఒకే వ్యక్తి మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా కొనసాగుతుండటం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2009లోనే ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన అధికారిని, 2011 నుంచి నేటి వరకు ఎండీగా కొనసాగిస్తుండటం వెనుక ఉన్న మర్మమేమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

సహకార చట్టంలోని సెక్షన్‌‌ 28 ప్రకారం.. అధికారి స్థాయి వ్యక్తి 58 ఏండ్లకే పదవీ విరమణ చేయాలి. కానీ, జి.విద్యాసాగర్‌‌ రెడ్డి విషయంలో ఈ నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. 2011లో బాధ్యతలు చేపట్టిన ఆయన.. అప్పటి నుంచి రాజకీయ పైరవీలతో పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. గతేడాది రిటైర్డ్‌‌ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో భాగంగా ఈయనను తొలగించినా.. తిరిగి మళ్లీ ఏప్రిల్‌‌ 2025 వరకు రెన్యూవల్‌‌ చేయించుకోవడం గమనార్హం. కాగా, ప్రస్తుత పదవీ కాలం మే 23తో ముగియనుండటంతో మరోసారి రెన్యూవల్‌‌ కోసం విద్యాసాగర్‌‌ రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. 

ఎంక్వైరీ లేదు..

శ్రీనిధి ఎండీపై నిధుల దుర్వినియోగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులను వేధించడం, నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం వంటి అంశాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో జీవో నం.523 ద్వారా నలుగురు ఐఏఎస్‌‌ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి విచారణ కమిటీని నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా.. నేటికీ ఆ ఎంక్వైరీపై అతీగతీ లేదు. గతేడాది అక్టోబర్‌‌‌‌ 10న జీవో 64 జారీ చేస్తూ ఆయన పదవిని మళ్లీ పొడిగించడం గమనార్హం.

©️ VIL Media Pvt Ltd.