Reading Time: 2 minutes
Off The Record About Show Cause Notices To Tahsildars In Kethireddy Land Dispute What Is The Real Intent

Off The Record: గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డిపై గతంలో టీడీపీ ఎన్నో ఆరోపణలు చేశారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ఆయన వెళ్లేదే ఆస్తుల కబ్జాకని కూటమి పార్టీ నాయకులు బలంగా ప్రచారం చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఏ ఒక్కటి కూడా నిరూపించలేక పోయిందని కేతిరెడ్డి వర్గీయులు చెబుతుంటారు. అదే విషయాన్ని కేతిరెడ్డి తనదైన భాషలో, స్వాగ్ తో చెబుతారు కూడా. అయితే ఆయనపై ఉన్న మరో బలమైన ఆరోపణ చెరువు స్థలాన్ని ఆక్రమించి విలాసవంతమైన రాజభవనం నిర్మించుకున్నారని. వైసీపీ అధికారంలో ఉండగా ధర్మవరం చెరువును ఆనుకుని… ఎర్రగుట్టపై ఫామ్ హౌస్ కట్టుకోవడంపై వివాదం రేగింది. గతంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ధర్మవరం వచ్చినప్పుడు చెరువు దగ్గర కేతిరెడ్డి కట్టుకున్న ఫామ్ హౌస్ వీడియోలు రిలీజ్ చేసి చాలా ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఆరోపణలు చేస్తున్నా.. కూటమి అధికారంలోకి రాగానే 2024 నవంబర్ నెలలో చెరువు క్రమించారంటూ నీటి పారుదలశాఖ అధికారులు కేతిరెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లు, పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని నోటీసుల్లో చెప్పారు.

ఇది పూర్తిగా రాజకీయ ప్రోద్బలంతో ఇచ్చిన నోటీసులని కేతిరెడ్డి అప్పట్లోనే కౌంటర్ ఇచ్చారు. అధికారులు నోటీసులు ఇవ్వడం కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని.. ఆ దిశగా సివిల్ కోర్టుకు వెళ్తానని చెప్పారు. ఇక్కడ ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా అనేది వాస్తవం కాదని.. గతంలో హైకోర్టు కూడా ఇదే చెప్పిందన్నారు. మరోవైపు ప్రభుత్వ భూమి కూడా ఎక్కడా కబ్జాకు గురి కాలేదన్నారు. ధర్మవరం చెరువు ప్రాంతంలో గుర్రాల కొండపై నిర్మించుకున్న వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమి 2.42 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. సర్వే నెం. 905-2లో 2. 42 ఎకరాలు మాజీ ఎమ్మెల్యే సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్టర్ అయింది. ఈ భూమిని 1960లో వ్యవసాయం చేసుకునేందుకు ధర్మవరం మండలం మోటుమర్లకు చెందిన అంకే నారాయణ, లక్ష్మీ చెన్నకేశవపురానికి చెందిన ఓబులమ్మ, రామగిరి మండలం శ్రీహరిపురానికి చెందిన తలారి అంజినమ్మలకు పట్టాలు ఇచ్చారు. వారు ఈ భూమిని గాలి వసుమతికి విక్రయించి రిజిస్టర్ చేయించారు. వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని విక్రయించడానికి అనుమతులు లేవు. భూమిని విక్రయించిన ముగ్గురికి ఇటీవల రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. దీనిపై కేతిరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.

తాజాగా కేతిరెడ్డి భూ ఆక్రమణలకు సహకరించారంటూ అప్పట్లో ధర్మవరం తహసీల్దార్లుగా పనిచేసిన యుగేశ్వరి దేవి, నీలకంఠారెడ్డికి ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తుంపర్తి గ్రామానికి చెందిన పరమేశ్‌ బలిగొల్ల అనే వ్యక్తి చెన్నైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 904, 904-బి, 904-సి, 905-2, 908-1, 909-1, 909-2లోని కొండప్రాంతం, సర్వే నం.661లోని ధర్మవరం చెరువులో 20 ఎకరాలను వెంకటరామిరెడ్డి ఆక్రమించారని ఆరోపించారు. ఆ భూముల్లో ఫాంహౌస్‌, గుర్రపుశాలలు, బోటింగ్‌, రేస్‌ కోర్సులు వంటివి నిర్మించారని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ తహసీల్దార్లకు నోటీసు ఇవ్వడం చర్చనీయాంశమైంది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినా కేతిరెడ్డి కోర్టు ద్వారా సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు తహసీల్దార్లు ఇచ్చే వివరణ బట్టి తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. మరి ఈ వివాదం నుంచి కేతిరెడ్డి ఎలా బయటపడతారో చూడాలి…