Reading Time: 2 minutes
Why Icc Gives Replica Trophy To T20 World Cup Winning Team

ICC T20 World Cup: భారత్ టీ20 వరల్డ్ కప్‌లో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే.. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం చాలా మందికి తెలియదు. టీ20 వరల్డ్ కప్పు గెలిచిన టీమ్‌కు ఐసీసీ ఇచ్చే ట్రోఫీ ఒరిజినల్ కాదట. ప్రపంచకప్ ఒరిజినల్ ట్రోఫీ ఎప్పుడూ ఐసీసీ ప్రధాన కార్యాలయంలోనే ఉంటుందట. ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం.. ఏ జట్టు గెలిచినా ఒరిజినల్ కప్పును ఆ దేశానికి తీసుకెళ్లనివ్వరు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీలో ఫొటోలు దిగేందుకు మాత్రమే ఒరిజినల్ కప్పును ఇస్తారు. ఫొటో షూట్ అయిపోయిన తర్వాత దాన్ని దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తారు. ఇక విక్టరీ సాధించిన జట్టుకు మాత్రం ఒక రెప్లికా (నకిలీ) కప్పును శాశ్వతంగా ఇస్తారు. ఆ జట్టు ఆ కప్పును తమ దేశానికి తీసుకెళ్లి, ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డు మ్యూజియంలో ఉంచుకుంటారట. విజేతగా నిలిచిన జట్టుకు ఒరిజినల్ కప్పును పోలిన రెప్లికా (Replica) ట్రోఫీని మాత్రమే శాశ్వతంగా అందజేస్తారన్న మాట.

READ MORE: Suryakumar Yadav: “నా నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్.. గోల్డ్ మెడల్ పక్కా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇక ఈ ట్రోఫీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూపుదిద్దుకుంది. జైపూర్‌కు చెందిన ట్రోఫీ రూపకర్త అమిత్ పబువాల్ (Amit Pabuwal) ఈ ట్రోఫీని తయారు చేశారు. మొదట ఈ ట్రోఫీకి సంబంధించిన రూపకల్పన ఆలోచనను ఆస్ట్రేలియాకు చెందిన Minale Bryce రూపొందించారు. ఆ రూపకల్పన ఆధారంగా తుది ట్రోఫీని తయారు చేసే బాధ్యతను అంతర్జాతీయ క్రికెట్ మండలి అయిన ఐసీసీ అమిత్ పాబువాల్‌కు అప్పగించింది. టీ20 వరల్డ్ కప్ 2007లో మొదటి సారి ప్రారంభమైంది. అదే సమయంలో ఈ ట్రోఫీ రూపకల్పన సైతం పూర్తయింది. రూపరేఖలు ఖరారైన తర్వాత ట్రోఫీ తయారీ పనిని తనకు అప్పగించారని అమిత్ పాబువాల్ తెలిపారు. అలా ప్రపంచ క్రికెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ట్రోఫీ జైపూర్‌లో రూపుదిద్దుకుంది. అయితే ఈ ట్రోఫీ తయారీ అంత సులభంగా జరగలేదు. మొదట ఈ ట్రోఫీని టైటానియం అనే లోహం, గాజు కలయికతో తయారు చేయాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లు త్వరగా ఫినిష్ అవుతాయి కాబట్టి.. 20 ఓవర్ల ఆట శైలిని ప్రతిబింబించేలా ఆధునిక రూపంలో ఉండాలని ఆలోచించారు. అందుకోసం అనేక నమూనాలు కూడా తయారు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. గాజును లోహంతో కలిపే సమయంలో అది పదే పదే విరిగిపోయింది. సాంకేతికంగా ఈ సేఫ్ రావడం కష్టంగా మారిందని అమిత్ పాబువాల్ గుర్తించారు. దాంతో చివరకు ట్రోఫీని వెండి లోహంతో తయారు చేసి, పైభాగానికి ప్లాటినం పూత వేయాలని నిర్ణయించారు. ఈ విధంగా తయారు చేసిన ట్రోఫీ బలంగా ఉండటంతో పాటు అంతర్జాతీయ స్థాయి పోటీకి తగిన గౌరవాన్ని ఇస్తుందని చెప్పారు.