Reading Time: 2 minutes
Iran Internal Rift President Pezeshkian Irgc Apology Withdrawal

Iran war: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌లు తమ దాడుల్ని మరింత తీవ్రం చేశాయి. మరోవైపు, ఇరాన్‌లో ‘‘పాలన మార్పు’’ను కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయిల్‌లు కొంత మేర సక్సెస్ అయ్యాయని అనిపిస్తోంది. ముఖ్యంగా, ఆ దేశ నాయకత్వంలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ.. తమ పొరుగు దేశాలైన యూఏఈ, కువైట్, ఖతాన్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై దాడులకు చేస్తున్నందుకు క్షమాపణలు కోరారు. ఇకపై దాడులు జరగవని హామీ ఇచ్చారు. అయితే, ఈ కామెంట్స్ చేసిన కొన్ని గంటలకే ఇరాన్ మళ్లీ గల్ఫ్ దేశాలపై దాడులు మొదలుపెట్టింది.

ఖమేనీ తర్వాత ఎవరు.?

దీనిని బట్టి చూస్తే, ఇరాన్ పాలన నిర్ణయాలు ప్రెసిడెంట్ పెజెష్కియాన్ దగ్గర లేవని తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన స్థానంలో కొత్త నాయకుడు ఎన్నిక జరగలేదు. దీంతో పాలనా బాధ్యతలు , నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ముగ్గురు సభ్యుల తాత్కాలిక మండలి ఏర్పడింది. ఇందులో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్(అధ్యక్షుడు), న్యాయవ్యవస్థ చీఫ్ గోలంహోస్సేన్ మొహ్సేని ఎజెయి, గార్డియన్ కౌన్సిల్ ఎంపిక చేసిన నేత అలిరేజా అరాఫీ ఉంటారు. సుప్రీం నాయకుడు ఎన్నికయ్యే వరకు వీరే నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తారు.

నిజమైన అధికారాన్ని IRGCనే చెలాయిస్తోందా.?

నిజానికి ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో అన్ని నిర్ణయాలు ఇరాన్‌లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీసుకుంటుందని తెలుస్తోంది. సైనిక వ్యూహాలు, భద్రత, ప్రధాన నిర్ణయాల్లో ఇదే ముఖ్యపాత్ర పోషిస్తోంది. దీంతో పాటు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజాని కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సైన్యం, ఐఆర్‌జీసీ కి మధ్య సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. యుద్ధ సమయాల్లో నిర్ణయాల్లో ఈయన ప్రమేయం బాగా పెరిగింది.

అధ్యక్షుడి ప్రకటనపై అసంతృప్తి:

దాడులు చేస్తున్నందుకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పడం అక్కడి సంప్రదాయవాదులకు రుచించడం లేదు. ఇరాన్‌పైకి ఆ దేశాల నేల నుంచి దాడులు జరగకుంటే తాము కూడా దాడులు చేయమని చెప్పారు. అయితే, ఈ ప్రకటనపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), ఇతర మత నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇది అంతర్గత విభేదాలను సూచిస్తోంది. మత నాయకుడు హమీద్ రసాయి మాట్లాడుతూ.. ఇది బలహీన, ఆమోదయోగ్యం కాని వైఖరి అని అన్నారు. సుప్రీం జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని కూడా అతని ప్రకటనను వ్యతిరేకించారు, “శత్రువు ఈ ప్రాంతంలోని స్థావరాల నుండి మనపై దాడి చేసినప్పుడు, మేము ప్రతిస్పందిస్తాము మరియు మేము ప్రతిస్పందిస్తూనే ఉంటాము.” అని అన్నారు. చివరకు పెజెష్కియాన్ తన ప్రకటనను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.