Reading Time: 2 minutes
Khammam Tragedy Ailing Husband Sets Wife Ablaze Before Ending His Life In Tirumalayapalem

KMM WIFE MURDER ATTEMPT: వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. కొన్నేళ్లుగా అన్యోన్నంగా కాపురం చేస్తున్నారు. కానీ భర్తకు వచ్చి అనారోగ్యం వారి కాపురంలో చిచ్చు పెట్టింది. వృద్ధాప్యంలో.. భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది ఆ భార్య. కానీ తన అనారోగ్యంతో నిత్యం జీవన్మరణ సమస్య కారణంగా ఆ భర్త ఎవరూ చేయని పని చేశాడు. కట్టుకున్న భార్యపైనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా తనువు చాలించాడు. అతను కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.. కానీ ఆ వృద్ధురాలు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. తోటమల్ల నాగభూషణంది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఆయన స్వస్థలం. తిరుమలాయపాలెంలోనే భార్య జయమ్మతో కలిసి నివాసముంటున్నారు. నాగభూషణం సుతారి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారిద్దరిది అన్యోన్యమైన కాపురం. ఎన్నో ఏళ్ల నుంచి దాంపత్యం సాగిస్తున్నారు. కానీ ఇటీవల నాగభూషణంకు వచ్చిన అనారోగ్యం వారి కాపురంలో చిచ్చురేపింది.

Read Also: CM Revanth Reddy : హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చాలి

టీవల కొంతకాలం నుంచి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న నాగభూషణం.. ఆ బాధను భరించలేక పలుసార్లు ఆత్మాహత్యా ప్రయత్నం చేశాడు. అది గమనించిన భార్య జయమ్మ అతడిని ఆత్మహత్య చేసుకోవద్దని వారించింది. అలా పలుమార్లు అడ్డుకుంది. ఆత్మహత్య చేసుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగేవి. అంటే ఆమె తన భర్తపై ఎంత ప్రేమ పెంచుకుందో అర్థమవుతోంది. కానీ నాగభూషణం.. కిడ్నీ సమస్యతో సతమతమవుతూ నిత్యం నరకం అనుభవిస్తున్నాడు. ఈ జీవితం నుంచి విముక్తి కావాలని అనుక్షణం కోరుకున్నాడు. కానీ భార్య తన మాట వినడం లేదని భావించాడు. ఆమె బతికి ఉన్నంత కాలం తనను ఆత్మహత్య చేసుకోనివ్వదని భావించి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆమె ప్రతిఘటిస్తున్న సమయంలో.. నాగభూషణం కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

జయమ్మ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు ఆమెని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దాదాపు 60 నుంచి 70 శాతం కాలిన గాయాలతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు నాగభూషణం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.