Reading Time: < 1 minute
Rinku Singhs Emotional Four Days Fathers Death Team Recall And Cricketing Test

టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్‌ తండ్రి ఖచంద్ర సింగ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఇటీవలే ఖచంద్ర ఆరోగ్యం విషమించడంతో నొయిడాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ కారణంగా జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్‌కు ముందు రింకూ జట్టును వీడాడు. దాంతో అతడు బిగ్ మ్యాచ్ మిస్ అయ్యాడు. రింకూ జీవితంలో వరుసగా నాలుగు రోజుల్లో జరిగిన సంఘటనలు అతడిని తీవ్రంగా కలచివేశాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒకేసారి ఎదురైన పరిస్థితులు భావోద్వేగపూరిత పరీక్షగా మారాయి.

ఫిబ్రవరి 24న అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని కలవడానికి రింకూ సింగ్ ఇంటికి వెళ్లాడు. తర్వాతి రోజు (ఫిబ్రవరి 25)న తిరిగి భారత జట్టులో చేరాడు. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో రింకూకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు.మ్యాచ్ అనంతరం ఫిబ్రవరి 27న రింకూ తండ్రి ఖచంద్ర సింగ్‌ కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఈ సంఘటనలు వరుసగా జరగడంతో రింకూ దిగ్భ్రాంతికి గురయ్యాడు. కుటుంబ బాధ్యతలు, జట్టు కర్తవ్యాల మధ్య అతడు ఎదుర్కొన్న ఈ క్లిష్ట పరిస్థితి ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో భారత జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు కురుస్తున్నాయి. జింబాబ్వేపై ఆడించాలనే ఉద్దేశం లేకపోతే.. తండ్రి పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో రింకూను ఎందుకు జట్టులోకి తిరిగి పిలిచారు? అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని విమర్శిస్తుండగా.. మరికొందరు పరిస్థితుల కారణంగా తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చని మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రింకూకు అభిమానులు, సహచర ఆటగాళ్లు ధైర్యం చెబుతూ మద్దతు తెలుపుతున్నారు. రింకూ క్రికెటర్‌గా ఎదగడంలో ఖచంద్ర సింగ్‌ పాత్ర ఎంతో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఎల్‌పీజీ గ్యాస్‌ డెలివరీ విభాగంలో పని చేసినా.. అరకొర డబ్బుతో రింకూను క్రికెటర్‌గా తీర్చిదిద్దారు.