Reading Time: < 1 minute

T20 World Cup: అభిషేక్ శర్మ ఆడుతారు.. పాక్ కూడా అదే కోరుకుంటుంది.. సూర్య కీలక వ్యాఖ్యలు 

Caption of Image.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా రేపు (ఫిబ్రవరి 15న) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనున్న భారత్ వర్సెస్ పాకిస్తాన్  మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు.  అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ అమెరికా, నమీబియాతో జరిగిన గత మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గత వారం రోజుల విశ్రాంతి తర్వాత పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నాడని చెప్పారు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడాలని తాము కోరుకుంటున్నామని కూడా సూర్యకుమార్  వెల్లడించారు.

ఈ మ్యాచ్‌కు ముందు హ్యాండ్‌షేక్ విషయం మరోసారి చర్చకు వచ్చింది. 2025 ఆసియా కప్ సమయంలో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్స్ తో హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడం వివాదంగా మారింది. ఈసారి కూడా అలాగే జరుగుతుందా? అని ప్రశ్నించగా, సూర్యకుమార్ స్పష్టమైన సమాధానం ఇవ్వక పోగా.. ఇంకో 24 గంటలు వేచి చూడండి అని వెల్లడించారు.  ఇదే సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ మంచి ప్లేయర్.. పూర్తిగా కోలుకుని ఆడితే బాగుంటుంది.. మేం భారత అత్యుత్తమ జట్టుతోనే ఆడాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్– పాకిస్థాన్ ఇప్పటివరకు 8 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 7 మ్యాచ్‌లు విజయం సాధించింది. పాక్ 2021లో ఒక్కసారి మాత్రమే గెలిచింది.  

©️ VIL Media Pvt Ltd.