
‘కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్యదే మనిషి జీవితం’.. అన్నారు ఓ సినీకవి. దానాల్లోకెల్లా ఎంతో ఉన్నతమైనది అవయవ దానం. మనిషి మరణానంతరం తన అవయవాలను దానం చేయడం ద్వారా కొందరికైనా పునర్జన్మ ప్రసాదించినవారవుతారు. కేరళలో పది నెలల వయసున్న ఒక చిన్నారి అవయవాలను దానం చేసి ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆదర్శంగా నిలిచారు.
ఈ చిన్నారి పేరు అలిన్ షెరిన్ అబ్రహం. కేరళలోని పాతనంతిట్ట ప్రాంతంలోని మలప్పళ్లి సొంతూరు. ఒక ఘోర ప్రమాదంలో ఈ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయింది. తమ బిడ్డ అవయవాలను దానం చేయడం ద్వారా తమ బిడ్డ బతికే ఉంటుందని అలిన్ తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ అన్నా జాన్ భావించారు. తమ పూర్తి అంగీకారంతో తమ పది నెలల బిడ్డ అవయవాలను దానం చేశారు.
This child, 10 months of age has given the gift of life to 5 people who needed organs, including two infants.
In an extraordinary act of courage amid unimaginable grief, the parents of 10-month-old #AlinSherinAbraham have chosen to donate her organs after she was declared brain… pic.twitter.com/KBpTbLeKW2
— Sneha Mordani (@snehamordani) February 14, 2026
లివర్, రెండు కిడ్నీలు, గుండె, కార్నియాను దానం చేసేందుకు ముందుకొచ్చారు. చిన్నారి లివర్ను ఆరు నెలల పసి బిడ్డకు, కిడ్నీలను మరో చిన్నారికి దానం చేశారు. తిరువనంతపురంలోని కిమ్స్ హాస్పిటల్లో ఆరు నెలల చిన్నారికి ఈ పది నెలల పాప లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయనున్నారు. ఆరు నెలల వయసున్న బిడ్డకు లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయడం కేరళలో అరుదైన ఘటన అని చెప్పాలి. తిరువనంతపురంలోని శ్రీ చిత్రా ఇన్ స్టిట్యూట్లో హార్ట్ వాల్వ్ను ఉంచారు. రెండు కళ్లను అమృత హాస్పిటల్కు తరలించారు.
అలిన్ కుటుంబం ఫిబ్రవరి 5న కొట్టాయం నుంచి తిరువళ్లకు కారులో వెళుతుండగా ఎంసీ రోడ్డు దగ్గరలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న కారు వీళ్లను ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో అలిన్ తో పాటు పాప తల్లి, అమ్మమ్మతాతయ్య తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వాళ్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ అలిన్ బ్రెయిన్ డెడ్ అయినట్లు ఫిబ్రవరి 13న వైద్యులు ప్రకటించారు.
అయినప్పటికీ అంత బాధాకరమైన సమయంలో కూడా అలిన్ తల్లిదండ్రులు మానవత్వంతో అవయవ దానానికి ముందుకొచ్చారు. కేరళలో అవయవ దానం చేసిన అతి చిన్న వయసున్న చిన్నారిగా అలిన్ చరిత్రలో నిలిచిపోయింది. తాను చనిపోయినా ఎందరికో జీవం పోసింది.