Reading Time: < 1 minute
డయాబెటిస్ నిర్థారణకు.. HBA1C టెస్ట్‌ ఒక్కటే కరెక్ట్‌ కాదు!

భారత్‌లో ఓ వ్యక్తికి డయాబెటిస్ ఉందని నిర్ధారణ చేయడానికి హెచ్‌బీఏ1సీ పరీక్షపైనే పూర్తిగా ఆధారపడటం సరైంది కాదని ప్రముఖ భారతీయ వైద్య నిపుణులు హెచ్చరించారు. భారతీయుల్లో అధికంగా కనిపించే రక్తహీనత లేదా అనీమియా వంటి సమస్యల కారణంగా ఈ టెస్టు ఫలితాలు తప్పుగా వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ‘ లాన్సెట్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఢిల్లీలో ప్రొఫెసర్ అనూప్ మిశ్రా నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. భారతీయులలో ఐరన్ లోపంతో వచ్చే రక్తహీనత, తలసేమియా, జీ6పీడీ లోపం వంటి హిమోగ్లోబిన్‌కు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితులు హెచ్‌బీఏ1సీ రీడింగ్‌ను ప్రభావితం చేస్తాయని, ఫలితంగా కొందరిలో షుగర్ వ్యాధి ఉన్నా గుర్తించకపోవడం లేదా లేకపోయినా ఉన్నట్టు తప్పుడు నిర్ధారణకు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనంలో వివరించారు. “కేవలం హెచ్‌బీఏ1సీపై ఆధారపడితే వ్యాధి నిర్ధారణలో పొరపాట్లు జరగవచ్చనీ దీనివల్ల కొందరిలో వ్యాధిని ఆలస్యంగా గుర్తించే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ అనూప్ మిశ్రా తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు, హెచ్‌బీఏ1సీతో పాటు ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్, సెల్ఫ్-మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్, కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ వంటి బహుళ పరీక్షల విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచించారు. ముఖ్యంగా వనరులు పరిమితంగా ఉండే గ్రామీణ ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కచ్చితమైన రోగ నిర్ధారణకు ఈ విధానం ఎంతో అవసరమని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త ‘సెక్యూరిటీ గార్డ్’