
- కాంగ్రెస్ సీఎంలు రాజీనామా చేసి మళ్లీ తేల్చుకోవాలి: బండి సంజయ్
- అనివార్య కారణాలతో అమిత్ షా టూర్ వాయిదా పడిందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీకి అనుమానముంటే.. తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే రాజీనామా చేసి, ప్రభుత్వాలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈవీఎంల వల్ల కాదా? అని ఆయన ప్రశ్నించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘంపై, ఈవీఎంలపై కాంగ్రెస్ పదేపదే నిరాధార ఆరోపణలు చేస్తోందని, దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరిం చాలని అన్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను బీజేపీ తో ముడిపెట్టడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. ఆయన ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రి కాదని, ఈసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని గుర్తుచేశారు. సర్ ప్రక్రియలో భాగంగా సీపీఎం దొంగ ఓట్లను తొలగించడంతోనే తాము కేరళలో అధికారంలోకి వచ్చామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితలే స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ‘ఇండీ’ కూటమికి జనాదరణ లేద ని, ఢిల్లీ, ముంబైలో వారు నిర్వహించిన ఆందోళన లకు పట్టుమని పది మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన వాయిదా పడిందని సంజయ్ తెలిపారు.
ఆలయాలపై దాడులు చేస్తే పిచ్చోళ్లని ముద్ర వేస్తారా?
దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత దేవాలయంపై జరిగిన దాడిని బండి సంజయ్ తీవ్రంగా ఖండిం చారు. రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో, దాడి చేసిన మతం వాళ్లు నొచ్చుకుంటారనే భయంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలు నిలదీస్తే దాడి చేసిన వ్యక్తి పిచ్చోడని ముద్ర వేసి కేసును తప్పుదోవ పట్టించడం ప్రభుత్వానికి అలవాటైపోయిందన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోదని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల వైఫల్యంపై బీఆర్ఎస్ పోరాడదన్నారు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ రాకముందు హైదరాబాద్‌లోనే ఇల్లు లేదని, చింతమడకలో వందల ఎకరాలు ఉన్నాయ నడం హాస్యాస్పదమన్నారు. అధికారంలోకి వచ్చా కే వాళ్లకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు, హోటళ్లు ఎలా వచ్చాయని నిలదీశారు. టీచర్లు, గ్రాడ్యుయేట్లు, యువత బీజేపీ వెంటే ఉన్నారని, ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.