Reading Time: 2 minutes

హైదరాబాద్ లో ఇళ్ల యజమానులకు పోలీసుల వార్నింగ్…! ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు…

Caption of Image.

హైదరాబాద్ లో ఇళ్ల యజమానులకు కీలక హెచ్చరిక జారీ చేశారు పోలీసులు. విదేశీయులకు ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు పాస్ పోర్ట్, వీసా తప్పనిసరిగా చెక్ చేయాలని సూచించారు. వీసా గడువు ముగిసినవారు, నకిలీ పత్రాలు ఉన్నవారిపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇళ్లు, హాస్టళ్లు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లకు కూడా ఈ నిబంధనలు వర్త.స్తాయని తెలిపారు.

OCI, నేపాల్, భూటాన్ పౌరులకు వసతి కల్పించినా వర్తించే నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు పోలీసులు. అక్రమ నివాసం, వీసా ఉల్లంఘనలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ లో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు.

ఇదిలా ఉండగా హైదరాబాద్‌ లో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై ఫోకస్ పెట్టారు పోలీసులు. వీసా గడువు ముగిసినా నగరంలోనే ఉంటున్న విదేశీయులపై ప్రత్యేక నిఘా పెట్టారు. శనివారం ( అక్టోబర్ 3 ) స్పెషల్ బ్రాంచ్, FRRO, స్థానిక పోలీసులు, IT సెల్‌తో సంయుక్త తనిఖీలు నిర్వహించారు.

ఆగస్టు 31 నుంచి నగరవ్యాప్తంగా ప్రత్యేక సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని… ఇప్పటివరకు 49 మంది అక్రమంగా ఉంటున్న విదేశీయుల గుర్తించామని వెల్లడించారు. 49 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోల్డింగ్ సెంటర్లకు తరలించినట్లు తెలిపారు. ఇప్పటికే 12 మంది విదేశీయుల డిపోర్టేషన్ చేశామని… మిగిలిన వారిని స్వదేశాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

పలువురు విదేశీయులు గడువు ముగిసిన వీసాలతో ఉంటూ నకిలీ కరెన్సీ, మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని అన్నారు. ఓ విదేశీయుడి దగ్గర 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.కొంతమంది ఆసుపత్రుల్లో విదేశీ రోగులకు ట్రాన్స్‌లేటర్లు, మధ్యవర్తులుగా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆసుపత్రి బిల్లుల్లో 15 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.

టూరిస్ట్ వీసాపై వచ్చి వీసా గడువు ముగిసినా ఉంటున్న కెన్యా మహిళ వ్యభిచారంలో పట్టుబడిందని.. ఓ విదేశీయుడు దగ్గు మందులో ఆల్ప్రాజోలమ్ మాత్రలు కలిపి మత్తు కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించామని అన్నారు. రాజేంద్రనగర్‌లో ముగ్గురు సౌత్ సుడాన్ పౌరులకు డ్రగ్ స్క్రీనింగ్‌లో గంజాయి పాజిటివ్ నిర్దారణ అయినట్లు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.