Reading Time: < 1 minute
తిరుపతిలో లవ్ జిహాద్ కలకలం.. పెళ్లికి మత మార్పిడి ఒత్తిడి.. MBBS విద్యార్థి అరెస్ట్!

తిరుపతి జిల్లాలో యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలని ఒత్తిడి చేసిన ఎంబీబీఎస్‌ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి అక్కారంపల్లికి చెందిన యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ రయీద్‌ ఖాద్రీని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి జార్జియాలో ఎంబీబీఎస్‌ చదువుతోంది. అదే సమయంలో సహచర విద్యార్థి అయిన మహమ్మద్‌ రయీద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత నెలలో రయీద్‌ తిరుపతికి వచ్చి ఓ హోటల్‌లో వారం రోజుల పాటు బస చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో యువతిని కలుసుకున్నట్లు వెల్లడించారు.

తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా.. పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని రయీద్‌ ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు అంగీకరించకపోతే తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించినట్లు యువతి పోలీసులకు తెలిపింది. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు అలిపిరి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో హైదరాబాద్‌లో ఉన్న నిందితుడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మలక్‌పేటలోని అక్బర్‌బాగ్‌లో రయీద్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

నిందితుడి నుంచి మొబైల్‌ ఫోన్‌తో పాటు కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో లభించిన డిజిటల్‌ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..