Reading Time: 2 minutes
Cjp Abhijeet Dipke Jantar Mantar Protest Gyanesh Kumar October 10

Abhijeet Dipke: ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ వంతు వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వేదికగా రెండో విడత పోరాటానికి పిలుపునిచ్చారు. కొన్ని నెలల కిందట పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంపై నెల రోజుల పాటు భారీ ఎత్తున నిరసనలు చేపట్టి, విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చేసిన CJP, ఇప్పుడు మరో పెద్ద ఉద్యమానికి తెరలేపింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ గనుక తన పదవికి రాజీనామా చేయకపోతే, అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన తెలుపుతామని సీజేపీ ప్రకటించింది.

ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (SIR) ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీజేపీ ఈ రాజీనామా డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఒక దర్యాప్తు కథనంలో వెల్లడించడమే ఈ లేటెస్ట్ ఆందోళనకు తక్షణ కారణమైంది. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ, జ్ఞానేశ్ కుమార్ గనుక రాజీనామా చేయకపోతే దేశం నలుమూలల నుంచి ‘కాక్రోచ్‌లు’ (కార్యకర్తలు, మద్దతుదారులు) అక్టోబర్ 10న ఢిల్లీకి తరలివచ్చి జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతారని ట్వీట్ చేశారు. ఒకవేళ ఢిల్లీ పోలీసులు తమను అడ్డుకోవాలని చూస్తే, ఎక్కడ ఆపితే దాన్నే తమ జంతర్ మంతర్‌గా మార్చుకుంటామని చాలా స్పష్టంగా హెచ్చరించారు.

పోలీసులు లేదా ప్రభుత్వం తమను ఎలా ఎదుర్కొన్నా, తమ పోరాటం మాత్రం పూర్తిగా గాంధేయ మార్గంలో శాంతియుతంగానే సాగుతుందని దీప్కే స్పష్టం చేశారు. అదే సమయంలో జూలై 20న జరిగిన హింసను గుర్తుచేస్తూ, ఢిల్లీ పోలీసులు మళ్లీ అలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించవద్దని హెచ్చరించారు. తాము రాజ్యాంగం ఇచ్చిన శాంతియుత నిరసన హక్కును గౌరవిస్తారో లేక జూలై 20 నాటి ఘటనాక్రమాన్ని మళ్లీ రిపీట్ చేస్తారో అది ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల చేతుల్లోనే ఉందన్నారు. ఈ పోరాటం “మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి” జరుగుతున్నదని, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని కోరుకునే పౌరులంతా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇక్కడ జూలై 20నాటి ఘటనల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. నాడు పార్లమెంట్ వైపు విద్యార్థులు చేపట్టిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సమయంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పలువురు విద్యార్థులతో పాటు ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), CRPF సిబ్బందికి గాయాలయ్యాయి. నిరసనకారులపై నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఏఎఫ్ మెటల్ పెల్లెట్లు ఉపయోగించిందని, దీనివల్ల తమకు గాయాలయ్యాయని చూపే వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారం ఆగస్టులో సుప్రీంకోర్టుకు చేరగా, నాడు జరిగిన హింసపై, పోలీసుల అతిక్రమణలపై విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది.