Reading Time: 2 minutes
India Pakistan No Handshake Asian Games 2026 Cricket Final

India vs Pakistan: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. శనివారం (అక్టోబర్ 3) జరిగిన ఈ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ జట్లు తలపడగా.. టాస్ పడిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. గత కొంతకాలంగా ఆసియా కప్ నుంచి ఐసీసీ టోర్నీల వరకు భారత్, పాకిస్థాన్‌ క్రికెట్ మ్యాచ్‌లలో చూస్తున్న ఈ ‘నో-హ్యాండ్ షేక్’ ధోరణి ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లోని అత్యంత కీలకమైన పసిడి పోరులోనూ కొనసాగడం గమనార్హం. సెమీఫైనల్లో శ్రీలంకపై 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి భారత్ ఫైనల్‌కి దూసుకొస్తే, బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్థాన్‌ తుది సమరానికి అర్హత సాధించింది. ఇక గోల్డ్ మెడల్ కోస జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ సమయంలో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పాకిస్థాన్‌ కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ల మధ్య కాస్త దూరంగా నుంచే కొన్ని మాటలు నడిచాయి తప్ప, ఇద్దరూ దగ్గరకు వచ్చి హ్యాండ్‌షేక్ మాత్రం చేసుకోలేదు. ఒకరికొకరు దూరంగానే ఉంటూ తమ వైఖరిని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ను టీమిండియా కరివేపాకులా తీసి పారేసిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక ఈ టోర్నీలో ఇతర క్రీడల విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ఏషియన్ గేమ్స్‌లోని టేబుల్ టెన్నిస్ మ్యాచ్‌లలో భారత్, పాకిస్థాన్‌ ఆటగాళ్లు మ్యాచ్ ముగిసాక ఎంతో సాధారణంగా చేతులు కలిపారు. ఈవెన్ హాకీ సెమీఫైనల్లో కూడా ఇరు జట్ల ప్లేయర్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ మైదానంలో ఆత్మీయంగా పలకరించుకున్న ఫోటోలు బయటకొచ్చాయి. కానీ, క్రికెట్‌కు వచ్చేసరికి మాత్రం ఈ నో-హ్యాండ్ షేక్ సంప్రదాయం కొనసాగుతుండటం గమనార్హం. నిజానికి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) కానీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) కానీ ఆటగాళ్లు ఖచ్చితంగా చేతులు కలపాలని ఎలాంటి నిబంధనా పెట్టలేదు. కాకపోతే క్రీడాస్ఫూర్తికి, ఆటగాళ్ల మధ్య ఉండే స్నేహపూర్వక వాతావరణానికి సంకేతంగా ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు ఏషియన్ గేమ్స్ నుంచి వచ్చిన ఒక ఆసక్తికరమైన చిత్రం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు జరిగిన మహిళల క్రికెట్ విభాగంలో భారత మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించగా, పాకిస్థాన్‌ జట్టు బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఈ టోర్నీలో మహిళల విభాగంలో భారత్-పాక్ ముఖాముఖి తలపడకపోయినా, ప్రెజెంటేషన్ సమయంలో రెండు జట్ల క్రీడాకారిణులు ఒకే పోడియంపై కలిసి కనిపించారు. కానీ ఇప్పుడు పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్ టాస్ సమయానికి వచ్చేసరికి భారత్-పాకిస్థాన్‌ క్రికెట్ మధ్య నడుస్తున్న ఈ ‘నో-హ్యాండ్ షేక్’ అధ్యాయం ఏషియన్ గేమ్స్ వేదికగా మరోసారి హైలైట్ అయింది.