Reading Time: 2 minutes
Heart Attacks At 18 Explained Causes Symptoms And Risk Factors

హార్ట్ ఎటాక్ అంటే 50, 60 ఏళ్ల తర్వాత వచ్చే సమస్య అనే అభిప్రాయం ఇప్పుడు మారుతోంది. 18, 20, 30 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ఆసుపత్రులకు వస్తున్న యువత సంఖ్య పెరుగుతోందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

అంతేకాదు, బయటకు చాలా ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లో కూడా గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు కనిపిస్తున్నాయి. ముంబైలో వైద్యులు చికిత్స చేసిన అత్యంత చిన్న వయసు హార్ట్ ఎటాక్ పేషెంట్లలో ఒకరి వయసు కేవలం 18 ఏళ్లు. అతడు ఎక్కువగా స్మోకింగ్ చేసేవాడు. ఛాతిలో నొప్పి వచ్చినా మొదట పెద్దగా పట్టించుకోలేదు. బెంగళూరులో మరో 18 ఏళ్ల కాలేజీ విద్యార్థికి ఏకంగా ఒక కొరోనరీ ఆర్టరీలో 100 శాతం బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించారు. ఆ యువకుడు స్మోకింగ్‌తో పాటు రిక్రియేషనల్ డ్రగ్స్ కూడా ఉపయోగించినట్లు డాక్టర్లు చెప్పారు.

కార్డియాలజిస్టుల ప్రకారం..ఇప్పుడు 20 ఏళ్ల వయసు నుంచే హార్ట్ ఎటాక్ కేసులు కనిపిస్తున్నాయి. ఒక కార్డియాలజిస్ట్ వద్ద చికిత్స పొందుతున్న హార్ట్ ఎటాక్ పేషెంట్లలో కనీసం 25శాతం మంది 40 ఏళ్లలోపు వారే. దాదాపు 40 శాతం మంది 50 ఏళ్లలోపు వారే. అంటే హార్ట్ ఎటాక్ ఇప్పుడు వృద్ధాప్యంతో మాత్రమే ముడిపడిన సమస్యగా మిగలడం లేదు.

యువతలో దీనికి స్మోకింగ్ ఒక ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది. ఇక ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం లాంటి అంశాలు తరచుగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు, యువ హార్ట్ ఎటాక్ పేషెంట్లలో కనీసం మూడో వంతు మందికి కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లేదా బ్లడ్ ప్రెజర్ అసాధారణ స్థాయిలో ఉన్నట్లు వైద్యులు గమనించారు. ఇంకో సమస్య ఏంటంటే యువతలో హార్ట్ ఎటాక్ లక్షణాలను సరిగ్గా గుర్తించకపోవడం. ఛాతిలో మంట లేదా నొప్పిని చాలామంది గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి లేదా కండరాల నొప్పిగా భావిస్తారు. కొందరిలో ఛాతి బిగుతుగా అనిపించవచ్చు. మరికొందరికి ఎడమ చేయి లేదా రెండు చేతుల్లో నొప్పి రావచ్చు. పైభాగం వెన్నునొప్పి, దవడ నొప్పి, విపరీతమైన అలసట, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం, గ్యాస్ వచ్చినా త్రేన్పు రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ప్రతి యువ హార్ట్ ఎటాక్ వెనుక జీవనశైలి కారణాలే ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొందరిలో రక్తం గడ్డకట్టే సమస్యలు, కుటుంబం నుంచి వచ్చే తీవ్రమైన కొలెస్ట్రాల్ సమస్య , చిన్న వయసులోనే కుటుంబంలో హార్ట్ డిసీజ్ చరిత్ర లాంటి జన్యుపరమైన కారణాలు ఉండవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, మంచి నిద్ర ఉన్నా కూడా ఇలాంటి జన్యుపరమైన రిస్క్ ఉన్నవారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఫిట్‌నెస్. ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లడం, ఎక్కువసేపు వ్యాయామం చేయడం మాత్రమే గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉందనడానికి ఆధారం కాదు. స్మోకింగ్, కుటుంబ చరిత్ర, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్, ఆహారపు అలవాట్లు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా మారథాన్ రన్నింగ్, హెవీ జిమ్ ట్రైనింగ్ లేదా తీవ్రమైన వ్యాయామాలు ప్రారంభించేవారు తమ రిస్క్ ఫ్యాక్టర్లను ముందుగానే తెలుసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అవసరాన్ని బట్టి బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, స్ట్రెస్ టెస్ట్ లాంటి పరీక్షలను వైద్యులు సూచించవచ్చు. కుటుంబంలో చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చిన చరిత్ర ఉంటే మరింత ముందుగానే స్క్రీనింగ్ అవసరం కావచ్చు. ఇక వైద్యులు గమనిస్తున్న మరో ఆందోళనకరమైన విషయం యువ పేషెంట్లలో వ్యాధి తీవ్రత. 30 ఏళ్ల వయసులోనే మూడు ప్రధాన గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉన్న కేసులు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు.

కొందరిలో మొదటి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడే గుండెకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. గత 10 నుంచి 15 ఏళ్లలో హార్ట్ ఎటాక్ కేసులు ఊహించిన వయసుకంటే దాదాపు ఒక 10ఏళ్లు ముందుగానే కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.. ముఖ్యంగా చెడు అలవాట్లకు కచ్చితంగా దూరం పాటించాల్సిందే!