Reading Time: 2 minutes
డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి

సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. గ్రూప్‌-బి నాన్‌-గెజిటెడ్‌ కేడర్‌లో జూనియర్‌ కోర్ట్‌ అసిస్టెంట్‌ (JCA) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 250 జూనియర్‌ కోర్ట్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-బి నాన్‌-గెజిటెడ్‌) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 28, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 2026 సెప్టెంబర్‌ 1 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండటంతో పాటు ఇంగ్లిష్‌లో నిమిషానికి కనీసం 35 పదాలు (35 WPM) టైప్‌ చేసే సామర్థ్యం ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి సెప్టెంబర్‌ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 28, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మాజీ సైనికులు/దివ్యాంగుల ఫీజు రూ.750 చొప్పున నిర్ణయించారు. JCA పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా 131 నగరాల్లో నిర్వహించనున్నారు. అయితే కంప్యూటర్‌ టైపింగ్‌ టెస్ట్‌, డిస్క్రిప్టివ్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఢిల్లీలో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో JCA ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌

మొదటి దశలో 100 మార్కులకు 100 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 1 గంట 30 నిమిషాలు. ఇందులో జనరల్‌ ఇంగ్లిష్‌ 20, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ 15, జనరల్‌ నాలెడ్జ్‌ 15, రాజ్యాంగంలోని న్యాయవ్యవస్థకు సంబంధించిన నిబంధనలు 15, సుప్రీంకోర్టు రూల్స్‌-2013 నుంచి 10, సుప్రీంకోర్టు ఆఫీసర్స్‌ అండ్‌ సర్వెంట్స్‌ రూల్స్‌-1961 నుంచి 10, కంప్యూటర్‌ పరిజ్ఞానం నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే కనీసం 50 మార్కులు పొందాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ పరీక్ష మార్కుల ఆధారంగా తదుపరి దశకు 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రెండో దశ ఎంపిక కంప్యూటర్‌ టైపింగ్‌ టెస్ట్‌

రెండో దశలో 50 మార్కులకు 10 నిమిషాల కంప్యూటర్‌ టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇంగ్లిష్‌లో కనీసం 35 WPM వేగం సాధించాలి. ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు కనీసం 25 మార్కులు పొందాలి.

మూడో దశలో డిస్క్రిప్టివ్‌ రాత పరీక్ష

టైపింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు 100 మార్కులకు 2 గంటల పాటు డిస్క్రిప్టివ్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ప్రిసిస్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌ అంశాలు ఉంటాయి. ఈ పరీక్షలో కనీసం 50 మార్కులు సాధించాలి. టైపింగ్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్‌ పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు.

నాలుగో దశలో ఇంటర్వ్యూ

చివరి దశలో 25 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో కనీసం 13 మార్కులు సాధించాలి. ఇంటర్వ్యూకు అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో పిలుస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: అక్టోబర్ 7, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 28, 2026.
  • ఆబ్జెక్టివ్‌ పరీక్ష తేదీ: నవంబర్ 20, 2026 (తాత్కాలికంగా)
  • ఆన్సర్‌ కీ, అభ్యంతరాలు: నవంబర్‌ 22 నుంచి 23 వరకు

సుప్రీంకోర్టులో JCA ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.