Reading Time: 2 minutes
India Vs Pakistan Asian Games 2026 Final Team Analysis

India vs Pakistan Asian Games 2026 Final: ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్‌ మధ్య ఫైనల్ సమరానికి రంగా సిద్ధమైంది. నేడు (అక్టోబర్ 3) జరగబోయే ఈ గోల్డ్ మెడల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం (IST) ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభం అవుతుంది. క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్‌ లార్జర్ ద్యాన్ లైఫ్ కాంటెస్ట్. అలాంటిది ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడటం అంటే అంతకంటే పెద్ద పండగ మరొకటి ఉండదు. అయితే, విచిత్రమేమిటంటే రెండు జట్లూ ఈ బిగ్ ఫైట్ కంటే ముందు పెద్దగా మ్యాచ్‌లేమీ ఆడలేదు. వర్షం కారణంగా క్వార్టర్ ఫైనల్స్ రద్దవ్వడంతో, బెటర్ సీడింగ్ ఆధారంగానే ఇరు జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఇక సెమీస్ మ్యాచ్‌లను పరిశీలిస్తే, అక్కడ పిచ్‌పై స్పిన్నర్లదే పైచేయిగా నిలిచింది. నేటి ఫైనల్ మ్యాచ్‌ ముంగిట రెండు జట్ల బలాబలాలు, టీమ్ కాంబినేషన్స్, రీసెంట్ ఫామ్‌ను ఒకసారి విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు స్పష్టమవుతున్నాయి.

ముందుగా సెమీఫైనల్స్‌లో వికెట్ విషయానికి వస్తే.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ సెమీస్ లో కేవలం 24.3 ఓవర్లలో 223(రెండు జట్లు కలిపి) పరుగులు నమోదవ్వగా.. ఏకంగా 11 వికెట్లు(రెండు జట్లు కలిపి) కూలాయి. మరోవైపు ఇండియా, శ్రీలంక మ్యాచ్‌లో 29.5 ఓవర్లలో 224 పరుగులు వస్తే, 17 వికెట్లు పడిపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే, రెండు మ్యాచ్‌లలో పడిన మొత్తం 28 వికెట్లలో 22 వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోనే పడ్డాయి. దీన్ని బట్టి ఫైనల్లో ఏ జట్టు స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తారో వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థమవుతోంది.

ఇక టీమిండియా విజయ అవకాశాల విషయానికి వస్తే.. శ్రీలంకపై ఆడిన తుదిజట్టులో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ రూపంలో బలమైన స్పిన్ అటాక్ ఉంది. అంతేకాకుండా పార్ట్‌టైమ్ స్పిన్నర్‌‌గా అభిషేక్ శర్మ కూడా బాల్‌తో అదరగొడుతున్నాడు. సెమీస్‌లో 169 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుంటూ లంకను కేవలం 45 పరుగులకే భారత్ ఆలౌట్ చేసిన తీరు అద్భుతం. పడిన 7 వికెట్లలో (మూడు రనౌట్లు) 5 వికెట్లు స్పిన్నర్లే తీశారు. స్పిన్ మాత్రమే కాకుండా, ఇండియా దగ్గర జస్ప్రీత్ బుమ్రా రూపంలో వరల్డ్ క్లాస్ పేసర్ ఉన్నాడు. పెద్ద మ్యాచ్‌లలో ఒత్తిడిని జయించి మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో బుమ్రా దిట్ట. 2024 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌‌పై స్లో పిచ్‌పై అతను వేసిన స్పెల్ దీనికి నిదర్శనం. ఇలా అటు స్పిన్, ఇటు పేస్ రెండింట్లోనూ మ్యాచ్‌ను మనవైపు తిప్పుకునే ఆప్షన్లు భారత్‌కు ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలో చూస్తే సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ రూపంలో విధ్వంసకర ఓపెనర్లు ఉన్నారు. సెమీస్‌లో టాప్ ఆర్డర్ త్వరగా పెవిలియన్ చేరినా, ఇషాన్ కిషన్ బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకున్నాడు. అలాగే తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె లాంటి మ్యాచ్ విన్నర్లు ఉండటంతో భారత బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా, లోతుగా కనిపిస్తోంది.

మరోవైపు పాకిస్థాన్‌ జట్టును పరిశీలిస్తే, వారి దగ్గర కూడా మంచి స్పిన్ వైవిధ్యం ఉంది. సుఫియాన్ ముకీమ్ భారత బ్యాటర్లకు పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది, అలాగే సైమ్ అయూబ్ రాకతో వారి స్పిన్ బలం పెరిగింది. అయితే అబ్రార్ అహ్మద్ సెమీస్‌లో కీలక సమయంలో పరుగులు సమర్పించుకుని బంగ్లాదేశ్‌‌ను మ్యాచ్‌లోకి రప్పించడం వారి స్పిన్ దాడిలోని లోపాన్ని బయటపెట్టింది. ఇక పేసర్ల విషయానికి వస్తే, అహ్మద్ దానియాల్ పరుగులను అదుపు చేసినా వికెట్లు తీయలేకపోయాడు. మహమ్మద్ వసీం జూనియర్ వికెట్లు తీయకపోగా పరుగులను కూడా నియంత్రించలేకపోయాడు. ఇది పాక్ బౌలింగ్‌లో ఉన్న స్థిరత్వ లేమిని చూపుతోంది. బ్యాటింగ్‌లో మాజ్ సదాకత్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాత్, ఉస్మాన్ ఖాన్ లాంటి మంచి పేర్లు ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అబ్దుల్ సమద్, హసన్ నవాజ్ ఆదుకుంటే కానీ గెలవలేకపోయారు. ముఖ్యంగా భారత్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌లలో ఫర్హాత్, అయూబ్, ఉస్మాన్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఒత్తిడికి లోనై విఫలమవ్వడం గతంలో చాలాసార్లు చూశాం. పాకిస్థాన్‌‌కు గెలిచే సత్తా, ప్లేయర్లు ఉన్నప్పటికీ, ఒత్తిడిని తట్టుకుని ఎలా ఆడతారనే దానిపైనే వారి విజయం ఆధారపడి ఉంటుంది.

మనం ఇప్పుడు చర్చిస్తున్న బలాబలాలను బట్టి ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయని అనుకున్నా, కొన్ని కీలక అంశాలు భారత్‌కు ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. ఇరు జట్లలో స్పిన్నర్లు ఉన్నప్పటికీ భారత స్పిన్నర్లకు ఉన్న అనుభవం చాలా ఎక్కువ. దానికి తోడు ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను గెలిపించగల జస్ప్రీత్ బుమ్రా ఉండటం భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్. బ్యాటింగ్ విభాగంలో పాకిస్థాన్‌‌లో హిట్టర్లు ఉన్నా వారి ప్రదర్శనలో స్థిరత్వం ఉండదు, కానీ ఇండియాలో ఒత్తిడిని జయించి మ్యాచ్‌లను గెలిపించే ఆటగాళ్లు ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తే, ఈ గోల్డ్ మెడల్ పోరులో భారత్ 52-48 ప్రాబబిలిటీతో పాకిస్థాన్‌ కంటే కాస్త ముందంజలో ఉందని చెప్పవచ్చు.