
Satyagraha: దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు చేస్తున్న నిరసనలు, ఆందోళనలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడైనా ప్రజలు అన్యాయంపై ఒంటరిగా పోరాడుతుంటే, వారి గొంతుకను బలంగా వినిపించేందుకు ‘సత్యాగ్రహ’ (Satyagraha) పేరుతో సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించారు. రైతులు, విద్యార్థులు, యువత (Gen Z), మహిళలు, దళితులు, గిరిజనులు తమ సమస్యలను, నిరసన వివరాలను ఈ వేదికపై నమోదు చేసుకుంటే.. వారికి అండగా పార్లమెంట్‌లో గళమెత్తడం మొదలుకొని రోడ్లపై నిలబడి పోరాటం చేసేందుకు సిద్ధమని రాహుల్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఒంటరి పోరాటానికి ముగింపు..
దేశంలో ఎక్కడెక్కడ ఏయే సమస్యలపై నిరసనలు జరుగుతున్నాయో ఒకే చోట తెలుసుకునేలా ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేకంగా ఒక ‘ఇంటరాక్టివ్ మ్యాప్’ను రూపొందించారు. తాము ఎదుర్కొంటున్న అన్యాయం లేదా తాము చేస్తున్న నిరసన చిన్నదైనా, పెద్దదైనా సరే.. సంబంధిత సమూహం లేదా వ్యక్తి పేరు, నిరసన లక్ష్యాన్ని ‘సత్యాగ్రహ’ వెబ్‌సైట్‌లో కేవలం రెండు నిమిషాల్లో అప్‌లోడ్ చేయవచ్చని చెప్పారు. నమోదు చేసిన వెంటనే ఆ వివరాలు ఈ మ్యాప్‌లో కనిపిస్తాయన్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా తమ సమస్య తరహాలోనే ఎవరెవరు ఎక్కడ పోరాడుతున్నారో సులభంగా తెలుసుకోవడంతో పాటు, పరస్పర మద్దతును కూడగట్టుకునే వీలు కలుగుతుందని చెప్పారు.
“నేను మీ కోసం రోడ్డెక్కుతాను.. పార్లమెంట్‌లో మాట్లాడతాను”
ఈ సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటిస్తూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో మెసేజ్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. “దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు.. కానీ చాలా సందర్భాల్లో వారు ఒంటరిగానే పోరాడుతున్నారు. పెరిగిన ధరలపై ఒకరు, మహిళల భద్రతపై మరొకరు, రైతు సమస్యలపై ఇంకొకరు.. ఇలా దేశ నలుమూలలా లక్షలాది ఉద్యమాలు సాగుతున్నాయి. అయితే, ఒంటరిగా వినిపించే గొంతును చాలా సులభంగా అణచివేసే ప్రమాదం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ మనకు నేర్పిన మార్గం ఒక్కటే.. సత్యమే అతిపెద్ద ఆయుధం. ఆ సత్యంతో అందరూ ఏకమై నిలబడితే అది అంతకంటే శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా మీ వెనుక నిలబడటం నా బాధ్యత. పార్లమెంట్ లోపల మీ తరఫున మాట్లాడటమైనా, అధికారులకు లేఖలు రాయడమైనా, అవసరమైతే మీతో కలిసి నడిరోడ్డుపై నిలబడి పోరాడటానికైనా నేను సిద్ధం” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతాంగ సంక్షోభం, మహిళల రక్షణ వంటి ఎన్నో అంశాలపై చెల్లాచెదురుగా సాగుతున్న ఉద్యమాలను సంఘటితం చేయడమే ఈ ప్రాజెక్ట్ అసలు వ్యూహంగా కనిపిస్తోంది. స్థానిక సమస్యలకే పరిమితమవుతున్న ఆందోళనలను నేరుగా జాతీయ రాజకీయ అజెండాగా మార్చేందుకు, ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు రాహుల్ ఎంచుకున్న ఈ డిజిటల్ ‘సత్యాగ్రహ’ అస్త్రం భవిష్యత్తులో అధికార పక్షానికి సరికొత్త సవాలు విసరనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
देशभर में लोग अपने हक़ के लिए लड़ रहे हैं – और अक्सर अकेले लड़ रहे हैं।
Gen Z, छात्र, किसान, आदिवासी, दलित, महिलाएँ – हर संघर्ष की अपनी कहानी है। पर जो आवाज़ अकेली उठती है, वो अक्सर दब जाती है।
‘सत्याग्रह’ इन्हीं आवाज़ों को एक नक्शे पर साथ लाने की पहल है।
बापू ने यही सिखाया था… pic.twitter.com/X8jUwnyLBO
— Rahul Gandhi (@RahulGandhi) October 3, 2026