Reading Time: 2 minutes
Chiranjeevi Praises Pilot Smit Machchhar Flydubai Attack Hanuman Chalisa

Chiranjeevi: గాల్లో 30 వేల అడుగుల ఎత్తు.. రెప్పపాటులో ఏం జరిగిందో తెలిసేలోపే విమానం వేల అడుగులు కిందకు పడిపోతోంది. పక్కనే ఉండాల్సిన కో పైలట్టే ఉన్నట్టుండి విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. మెడ, చేతులు తెగి రక్తం ధారగా కారుతోంది. తీవ్ర గాయాలతో శరీరం స్పృహ కోల్పోతున్న వేళ.. ప్రాణాలు పోతున్న క్షణాల్లోనూ ఆయన చేతులు మాత్రం విమానం కంట్రోల్స్ వదల్లేదు. కళ్లముందు ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలు, మదిలో నిరంతరం మారుమోగిన ‘హనుమాన్ చాలీసా’ ఆయనకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఆంజనేయస్వామి నామస్మరణతో మృత్యువు అంచుల దాకా వెళ్లి ఒంటిచేత్తో 174 మంది ప్రాణాలను కాపాడిన ఆ రియల్ హీరో ఎవరో కాదు.. మన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్. ఆకాశంలో చోటుచేసుకున్న ఈ అపూర్వ సాహసగాథ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా స్పందించి చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటున్నాయి.

మరణం కళ్లముందు నర్తిస్తున్న సమయంలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ హనుమాన్ చాలీసా జపిస్తూ మనోధైర్యాన్ని నింపుకున్నారన్న వార్త తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ మేరకు ఆయన కెప్టెన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ చేశారు.. “తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై కాపాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. జై హనుమాన్!” అంటూ చాలా ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.

అసలేం జరిగిందంటే.. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో (FZ1073) 174 మంది ప్రయాణికులు ఉన్నారు. సరిగ్గా ప్రయాణం సజావుగా సాగుతున్న సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న కో-పైలట్ ఊహించని విధంగా కెప్టెన్ స్మిత్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, విమానాన్ని నేలకేసి కొట్టేందుకు ప్రయత్నించాడు. క్షణాల వ్యవధిలోనే విమానం సుమారు 14,000 అడుగుల మేర కిందకు దూసుకువచ్చింది. మెడ, ఛాతీపై బలమైన గాయాలైనప్పటికీ కెప్టెన్ స్మిత్ వెనక్కి తగ్గలేదు. ప్రాణభయంతో వణికిపోకుండా సమయస్ఫూర్తితో కాక్‌‌పిట్ డోర్ ఎమర్జెన్సీ లాక్‌ను తెరిచి ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వచ్చేలా చేశారు. వెంటనే ఇతర సిబ్బంది సహకారంతో దుండగుడిని బంధించి, విమానాన్ని అత్యవసరంగా సౌదీ అరేబియాలోని తబూక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. రక్తం ఓడుతూ కూడా తోటి వారి ప్రాణాల కోసం ఒంటరి పోరాటం చేసిన ఈ భారతీయ పైలట్ తెగువ, దైవభక్తి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. భారతీయుడి గుండెధైర్యం, ఆపత్కాలంలో తోడ్పడిన హనుమంతుడి భక్తి విశ్వవ్యాప్తంగా మరోసారి సగర్వంగా నిలిచాయి.