
ఏడాదికిపైగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వైద్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. డీఎస్‌హెచ్ పరిధిలో 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించగా.. మరో 193 మందిపై వివిధ దశల్లో క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో మొత్తం 493 మంది వైద్యులు, ఇతర సిబ్బంది విధులకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు.
ఏడాదికిపైగా డ్యూటీకి దూరం, 70 మంది వైద్యుల తొలగింపు
డీఎస్‌హెచ్ పరిధిలో ఏడాదికిపైగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించారు. సివిల్ సర్వీసు నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు, ఇతర ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత చర్యలు తీసుకున్నారు. గైనిక్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్ సహా వివిధ విభాగాలకు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఇందులో ఉన్నారు.
మరో 193 మందిపై చర్యలు, కొందరికి చివరి అవకాశం
డీఎస్‌హెచ్ పరిధిలో మరో 154 మంది వైద్యులకు ఇప్పటికే సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. తదుపరి చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. మరోవైపు డీఎంఈ పరిధిలో ఏడాదికి పైగా, రెండేళ్లలోపు విధులకు దూరంగా ఉన్న 39 మంది వైద్యులకు ప్రభుత్వం తుది అవకాశం ఇచ్చింది. వీరిలో 5 మంది ప్రొఫెసర్లు, 4 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 30 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. స్పందించకపోతే విధుల నుంచి తొలగించనున్నారు.
ప్రైవేట్ ప్రాక్టీస్, పోస్టింగ్‌లపై అసంతృప్తి.
వైద్యులు విధుల్లో చేరిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్, పోస్టింగ్‌లు నచ్చకపోవడం, ఆరోగ్య, కుటుంబ, ఇతర కారణాలతో విధులకు దూరంగా ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. నోటీసుల తర్వాత విధుల్లో చేరేందుకు ముందుకొచ్చిన వారికి నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూనే అవకాశం కల్పిస్తున్నారు. డీఎస్‌హెచ్ పరిధిలో ఇప్పటికే 78 మంది తిరిగి విధుల్లో చేరారు.
మొత్తం 493 మంది గైర్హాజరు- మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి
వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ హెచ్‌ఓడీల పరిధిలో మొత్తం 493 మంది వైద్యులు, ఇతర సిబ్బంది విధులకు దూరంగా ఉన్నట్లు తేలింది. గైర్హాజరీపై ఎలాంటి ఉపేక్ష వద్దని మంత్రి సత్యకుమార్ అధికారులకు స్పష్టం చేశారు. గరిష్టంగా మూడు నెలల్లో చర్యల ప్రక్రియ పూర్తి చేసి.. అవసరమైన పోస్టులను ‘జీరో వేకెన్సీ పాలసీ’ కింద భర్తీ చేయాలని ఆదేశించారు.