
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలపై కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలను రాష్ట్ర సర్కార్ ఘనంగా నిర్వహించనుంది.
ఈ క్రమంలోనే.. అక్టోబర్ 18న ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అమరవీరుల స్థూపం నుంచి భారీ బతుకమ్మ ర్యాలీ జరగనుంది. ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
బతుకమ్మ ఘాట్‌లో, నెక్లెస్ రోడ్‌లోనూ నిమజ్జనాలు జరగనున్నాయి. రవీంద్రభారతిలో 10 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లోనూ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ప్రభుత్వం బతుకమ్మకు ప్రత్యేక లోగో రూపొందిస్తుంది. బతుకమ్మ లోగోలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అంశం ఉండనుంది. గతేడాది కూడా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. తెలంగాణ ముత్తయిదువులా మెరిసిపోతుంది. సాయంత్రం నుంచి మొదలు పెడితే నడి రాత్రి వరకు కూడా ఆడపడుచులందరి గొంతుక నిండా బతుకమ్మ పాటలే మార్మోగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం మరోసారి బతుకమ్మ ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా చాటాలని సంకల్పించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది.