
వికారాబాద్ జిల్లా, పూడూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్‌గూర్తి గ్రామ శివారులో చోటుచేసుకుంది.
స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మాటుగూడెం గ్రామానికి చెందిన మమతకు భర్త రాజుతో నిన్న ఉదయం గొడవ జరిగింది. అనంతరం మమత తన ఇద్దరు పిల్లలు సాకేత్ (8), జనశ్రీ (4)లను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. ఈ క్రమంలో సోమన్‌గూర్తి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావి సమీపంలో మమతకు చెందిన చెప్పులు, బ్యాగ్ కనిపించాయి. దీంతో ఆమె పిల్లలతో కలిసి బావిలో దూకి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మమత, ఆమె కుమార్తె జనశ్రీ మృతదేహాలను వెలికితీశారు. మరో కుమారుడు సాకేత్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. మమత ఇంటి నుంచి పిల్లలను తీసుకుని వెళ్లిన విషయంపై కుటుంబ సభ్యులు నిన్న రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమా? అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.