
సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి మరోసారి అగ్గి రాజేశారు. తనపై వచ్చే ట్రోలింగ్స్, కాంట్రవర్సీలపై ఎవరూ ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యారు. తాజాగా జరిగిన ‘చంద్రయాన్’ సినిమా ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు, తనను తాను బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌తో పోల్చుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. “ఈ ప్రశ్న ఎవరు అడుగుతారా అని గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో బ్రతకడం అంటే 2+2=4 కాదు.. 2+2=5 అనాల్సిందే! నేను నీ బట్టలు విప్పొచ్చు కానీ, నువ్వు నావి విప్పడానికి వీల్లేదు అన్నట్లే ఇక్కడి పరిస్థితి ఉంది. అసలు దుకాణమే రోడ్డు మీద పెట్టుకున్నాం. నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా, ఇక నా దగ్గర కొత్తగా విప్పడానికి ఏమీ లేదు! ఎక్కడ ఎవరు దొరుకుతారా అని చూసేవాళ్లు, హైప్ కోసం చూసే జర్నలిస్టులు ఉన్నప్పుడు.. కాంట్రవర్సీ చేస్తేనే సోషల్ మీడియాలో పైకి వెళ్తాం” అంటూ ఓపెన్‌గా కుండబద్దలు కొట్టేశారు.
సెలబ్రిటీల గురించి ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారన్న దానికి బదులిస్తూ సల్మాన్ ఖాన్ ప్రస్తావన తెచ్చారు. “సల్మాన్ ఖాన్‌కు సెప్టెంబర్ తర్వాత రాచపుండు రాబోతుందని స్వయంగా వాళ్ల తమ్ముడితో ఫోన్లో మాట్లాడి చెప్పా. ఆయన లైట్ తీసుకుని ‘ఐ విల్ టేక్ కేర్’ అన్నాడు. కానీ అదే మాట మన లోకల్ వాళ్లకు చెబితే అంత ఈజీగా తీసుకోరు. సమాజంలో ఒక స్థాయికి ఎదిగిన పెద్ద వ్యక్తులు దెబ్బతింటే వారిపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. అందుకే వాళ్లను కాపాడాలనే ఉద్దేశంతోనే హెచ్చరిస్తున్నా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 నాకు ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ మేరకే నేను జాతకాలు చెబుతున్నా” అని సమర్థించుకున్నారు. ఈ ప్రెస్ మీట్ ప్రారంభంలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు వేణుస్వామి ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.
‘ఒకవేళ రాకెట్‌లో రోదసి యాత్రకు వెళ్తే మీ పక్కన ఏ టాలీవుడ్ సెలబ్రిటీని తీసుకెళ్తారు?’ అని అడగ్గా.. “హీరోల్లో అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను తీసుకెళ్తా.. ఇక హీరోయిన్లలో అయితే కాబోయే హీరోయిన్ షర్మిలను తీసుకెళ్తా” అంటూ చమత్కరించారు. శ్రీనాథ్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నిర్మించిన ‘చంద్రయాన్’ చిత్రంపై ఆయన ఆస్ట్రాలజీ పరంగా జోస్యం చెప్పారు. 2000 సంవత్సరాల తర్వాత గురువు మూడు రాశుల్లోకి మారే ‘గురువు అతిచారం’ జరుగుతోందని, బార్హస్పత్యమానం ప్రకారం జాతకాలు చెప్పే ఏకైక వ్యక్తిని తానేనని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 30న కార్తీక పౌర్ణమి నాడు రిలీజ్ కాబోతున్న ఈ ‘చంద్రయాన్’ సినిమాతో నిర్మాతకు ఒక్క రూపాయి కూడా నష్టం రాదని, డైరెక్టర్‌తో పాటు నటీనటులకు మరిన్ని అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రతిభావంతుడైన దర్శకుడు వేణు ఊడుగులతో కలిసి త్వరలోనే తాను ఒక భారీ సినిమా చేయబోతున్నట్లు కూడా వేణుస్వామి వెల్లడించారు.