Reading Time: < 1 minute
Cjp Shivaji Park Protest 75 Year Old Man Dies Abhijeet Dipke

CJP Protest: ముంబైలోని శివాజీ పార్క్‌ వద్ద శనివారం జరిగిన నిరసన ప్రదర్శనలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి వేలాదిగా జనాలు తరలివచ్చారు. అయితే, ఈ ఆందోళనలోనే పాల్గొనేందుకు థానే నుంచి దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించి ముంబైలోని శివాజీ పార్క్‌‌కు వచ్చిన గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్లై (75) అనే వృద్ధుడు గుండెపోటుతో కన్నుమూశారు. థానేలోని దోస్తీ వెస్ట్ కౌంటీ బి-వింగ్‌లో నివసించే ఆయన, సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. వచ్చిన అరగంటకే ఆయనకు ఛాతీలో తీవ్రమైన నొప్పులు రావడంతో, వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

ఇక ఈ నిరసన కార్యక్రమం విషయానికి వస్తే.. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల నుంచే జనాలు శివాజీ పార్క్‌‌ పరిసర ప్రాంతాలకు పోటెత్తారు. పోలీసుల అనుమతి లేకపోయినప్పటికీ వేలాది మంది ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీజేపీ నాయకుడు అభిజీత్ దిప్కే.. ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే దిగిపోకపోతే ‘జంతర్ మంతర్ 2.0’ తరహా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా బీజేపీతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీ గాలి వీచిన సమయంలో కూడా గెలవని రాష్ట్రాలను, ఓటర్ల పేర్ల తొలగింపు ద్వారానే బీజేపీ గెలుచుకుందని ఆయన ఆరోపించారు.

మరోవైపు సీజేపీ నాయకుడు అజింక్య షిండే మాట్లాడుతూ.. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయడమే కాకుండా ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2025 నాటి ఓటర్ల జాబితాను తక్షణమే నిలిపివేయాలని, ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకున్నా భారీగా గుమిగూడిన జనాలు, జ్ఞానేష్ కుమార్ రాజీనామాతో పాటు 2025 ఓటర్ల జాబితాలు, 2023 నాటి నియామక చట్టాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీజేపీ అగ్రనేతలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో శివాజీ పార్క్ పరిసరాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.