Reading Time: < 1 minute

SIRపై రిటైర్డ్ జడ్జిలతో స్వతంత్ర కమిషన్.. డిసెంబర్‌లో రిపోర్టు!

Caption of Image.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ చెల్లుబాటు, ప్రభావంపై విచారణ చేపట్టేందుకు మాజీ న్యాయమూర్తులతో కూడిన స్వతంత్ర విచారణ కమిషన్‌ను ‘లాయర్స్ అసోసియేషన్స్ ఫర్ కాన్స్టిట్యూషన్( )’ ఏర్పాటు చేసింది. SIR అమలుతో ఓటర్లపై, ఎన్నికల ప్రక్రియపై పడుతున్న ప్రభావాన్ని పరిశీలించడమే ఈ కమిషన్ లక్ష్యంగా ఏర్పాటు చేశారు. 

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి. లోకూర్ ఈ కమిషన్‌కు నేతృత్వం వహించనున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎ.కె. పట్నాయక్, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బదర్ దారేజ్ అహ్మద్, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా శర్మ, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంజనా ప్రకాష్ సభ్యులను ఈ కమిషన్ లో సభ్యులుగా నియమించారు. 

ఈ కమిషన్‌కు సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్, సి.యు. సింగ్, పి.సి. సేన్, రాజు రామచంద్రన్, రెబెక్కా ఎం. జాన్, వారిషా ఫరాసత్, వ్రిందా గ్రోవర్ తదితరులు న్యాయ సలహాదారులుగా ఉన్నారు. 

SIR ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ఈ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహించనుంది. ఈ విచారణ ద్వారా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు, వివరాలు సేకరించి.. డిసెంబర్ 2026 నాటికి రిపోర్టు విడుదల చేయనున్నట్లు లాయర్స్ అసోసియేషన్స్ ఫర్ కాన్స్టిట్యూషన్ తెలిపింది.

SIRపై సుప్రీంకోర్టు ఇప్పటికే రాజ్యాంగబద్ధతను సమర్థించిన క్రమంలో తాజాగా మాజీ న్యాయమూర్తులతో ఏర్పాటైన స్వతంత్ర కమిషన్ విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది. బహిరంగ విచారణల ద్వారా సేకరించే వివరాలు, అభిప్రాయాల ఆధారంగా కమిషన్ ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తుందో, డిసెంబర్‌లో విడుదల కానున్న నివేదికలో ఏ విషయాలను వెల్లడిస్తుందో ఆసక్తికరంగా మారింది.

©️ VIL Media Pvt Ltd.