Reading Time: 2 minutes
Jr Ntr Ai Morphing Chuttamalle Video Warning Legal Action

Jr NTR: సాంకేతికత వికృత రూపం దాల్చి మహిళల ఆత్మగౌరవాన్ని బజారుకీడుస్తున్న తీరుపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’ను అడ్డం పెట్టుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో కొందరు వికృత చేష్టలకు పాల్పడటంపై ఆయన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అత్యంత దిగజారుడు తనంతో మహిళలను కించపరిచేలా మార్ఫింగ్ కంటెంట్‌ను సృష్టించిన వారిపై విరుచుకుపడుతూ, “మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అంటూ అల్టిమేటం జారీ చేశారు. ‘చుట్టమల్లే’ పాటను అసభ్యకర రీతిలో ఏఐ ద్వారా మార్ఫ్ చేసి నెట్టింట వైరల్ చేసిన కీచకులపై సోషల్ మీడియా వేదికగా తారక్ చేసిన పోస్ట్‌లో వాడిన పదజాలం చూస్తే ఆయన ఎంతటి ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారో స్పష్టంగా అర్థం అవుతుంది.

“అసహ్యకరం.. రోత పుట్టించే సిగ్గుమాలిన చర్య ఇది! స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే నేల మనది. ‘మాతృదేవోభవ’ అనేది కేవలం మాట కాదు, మన సంస్కృతిలో భాగం. అలాంటి పవిత్రమైన గడ్డపై మహిళను ఇంత దారుణంగా కించపరిచేందుకు ఏఐ టెక్నాలజీని వాడుతూ కొందరు ఇంత నీచానికి దిగజారడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు. ఈ మార్ఫ్ చేసిన ‘చుట్టమల్లే’ వీడియో వెనుక ఉన్న నీచుల్లారా.. మీలో ఒక్కడినీ వదిలిపెట్టను! ఈ వీడియోను క్రియేట్ చేసిన వారిపై, దీనిని సర్క్యులేట్ చేస్తూ వైరల్ చేస్తున్న వారిపై సాధ్యమైన ప్రతి చట్టపరమైన చర్యలూ తీసుకుంటా!” అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ఇలాంటి వికృత కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని నెటిజన్లను ఎన్టీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మార్ఫింగ్ వీడియోలను చూడటం, ఇతరులకు షేర్ చేయడం లేదా వాటితో ఎలాంటి ఎంగేజ్‌మెంట్ పెట్టుకోవడం తక్షణమే ఆపేయాలని కోరారు.

“ఈరోజు ఎవరో ఒక మహిళ బాధితురాలు కావొచ్చు.. కానీ రేపు మీ స్వంత తల్లి, చెల్లెలు, భార్య లేదా కూతురు కూడా ఈ వికృత పోకడల బారిన పడొచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి” అంటూ ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించేలా తారక్ చురకలు అంటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో పెచ్చురిల్లుతున్న డిజిటల్ నేరాలను అరికట్టేందుకు వ్యవస్థ కఠినంగా స్పందించాల్సిన సమయం వచ్చిందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి తక్షణమే అత్యంత కఠినమైన చట్టాలు, నిబంధనలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన గట్టిగా కోరారు. సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికే కాకుండా సాధారణ మహిళల భద్రతకు కూడా పెనుముప్పుగా మారిన డీప్‌ఫేక్, ఏఐ మార్ఫింగ్ టెక్నాలజీలపై జూనియర్ ఎన్టీఆర్ నేరుగా రంగంలోకి దిగి వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.