
కోల్‌కతా: 2021 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గాలికి గాయం కాలేదని.. ఆమె గాయమైనట్లు నటించారని సీఎం సువేందు అధికారి ఆరోపించారు. ఎముక విరగడం గానీ, పక్కకు జరగడం గానీ జరగలేదని తెలిపే వైద్య నివేదిక మా దగ్గర ఉందన్నారు.
ఈ ఘటనపై తమ ప్రభుత్వం విచారణ జరుపుతోందని ఆయన తెలిపారు. నందిగ్రామ్, రేజినగర్‌లలో ఉప ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున అక్టోబర్ 9 తర్వాత తన ఆరోపణలకు సంబంధించిన వివరాలను అందిస్తానని పేర్కొన్నారు.
సీఎం సువేందు అధికారి ఆరోపణలను టీఎంసీ తీవ్రంగా ఖండించింది. టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. ఎముక విరిగితేనే కట్టు కట్టాలని ముఖ్యమంత్రికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఎముక విరగకున్నా గాయం తీవ్రంగా ఉన్న కట్టు కడతారని అన్నారు. అసలు దీదీ కాలి ఎముక విరగలేదని ఆయనకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసని నిలదీశారు. ప్రభుత్వం ఆయన చేతుల్లో ఉంది.. కాబట్టి ఆయన ఎలాంటి వాదనలైనా చేయగలరని సీఎంను విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో మమతాకు గాయం
2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ గాయపడ్డ సంగతి తెలిసిందే. 2021 మార్చి 10న నందిగ్రామ్‌లోని బిరులియాలోని రేయాపారా ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా ఆమె ఎడమ కాలికి గాయాలయ్యాయి. ప్రచార సమయంలో భారీ జనసమూహం వల్ల గాయపడ్డట్లు దీదీ తెలిపారు.
మమతాను SSKM ఆసుపత్రిలో చేర్చగా అక్కడ ఆమె ఎడమ చీలమండ, పాదానికి తీవ్రమైన గాయమైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత దీదీ వీల్‌చైర్‌లో ప్రచారం నిర్వహించారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీ 210కి పైగా స్థానాలను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని చేసింది. బీజేపీ కేవలం 77 నియోజకవర్గాల్లో మాత్రం గెలుపొందింది.