
మియాపూర్, వెలుగు: హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ రైల్వే పోలీస్ అధికారి అత్యంత దారుణంగా ప్రవర్తించారు. విధుల్లో భాగంగా ఓ మహిళ పట్ల ఆయన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న ఆమెపై భౌతిక దాడికి దిగి, జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. సదరు మహిళ రాత్రి సమయంలో మద్యం మత్తులో గొడవ చేస్తుండగా.. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ ఆమెను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఆమెను కొడుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న సమయంలో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని సైతం ఆ అధికారి బెదిరింపులకు గురిచేశారు. మహిళ తప్పు చేసి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ, ఇలా బహిరంగంగా రోడ్డుపై దౌర్జన్యం చేయడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఆ పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.