
- రెండో విడతలో 352 ఎకరాలకు రిలీజ్
- మూడో విడతకు ఇప్పటికే ప్రపోజల్స్
యాదాద్రి, వెలుగు : గంధమల్ల రిజర్వాయర్ నిర్వాసితులకు ప్రభుత్వం వడివడిగా పరిహారం రిలీజ్‌చేస్తోంది. నిర్వాసితులకు ఇప్పటికే మొదటి విడత అందగా, రెండో విడత పరిహారం పంపిణీ చేసింది. మూడో విడతకు సంబంధించి ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపించారు. ఈ మొత్తం త్వరలో రిలీజ్ కానున్నాయి.
ఎకరానికి రూ. 24.50 లక్షలు..
నీటి వనరులు లేని ఆలేరు నియోజకవర్గం దశాబ్దాలుగా కరువులోనే ఉంటోంది. ఈ నియోజకవర్గానికి గంధమల్ల ద్వారా సాగు నీరు అందిస్తామని చెప్పిన గత ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంధమల్ల నిర్మాణంపై చర్యలు ప్రారంభించింది.
1.4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే తలపెట్టిన ఈ రిజర్వాయర్ కోసం రైతుల నుంచి దాదాపు వెయ్యి ఎకరాలు సేకరించాల్సి ఉంది. 2013 భూ సేకరణ చట్టంలో పేర్కొన్నదాని కంటే ఎక్కువగా పరిహారం అందించేందుకు ప్రభత్వం ఒప్పుకుంది. ఈ చట్టం ప్రకారం గరిష్ఠంగా ఎకరానికి రూ. 11.75 లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చొరవతో ఎకరానికి రూ. 24.50 లక్షలు అందిస్తామని ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.
స్పీడ్‌గా పరిహారం అందజేత..
ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులవుతున్న వారికి పరిహారం అందించడంలో గత ప్రభుత్వం నాన్చుడు వ్యవహారం సాగించింది. కానీ తాజాగా పరిహారం నిర్ణయించడం, అందించడంపై ప్రస్తుత ప్రభుత్వం స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకుంటోంది. మూడు కిలోమీటర్ల మేర నిర్మించే బండ్ కోసం 88.14 ఎకరాలను సేకరించారు. ఇందులో 2.30 ఎకరాలు వివాదంలో ఉంది. దీంతో మిగిలిన 85.24 ఎకరాలకు రూ. 17 కోట్లు ఇప్పటికే నిర్వాసితులకు అందించింది. పరిహారం మంచిగా నిర్ణయించడం, మొదటి విడత కూడా అందించడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
రెండో విడతలో రూ. 88.84 కోట్లు..
తొలి విడతలో బండ్ పోర్షన్‌కు పరిహారం అందించిన సర్కారు రెండో విడతలో రిజర్వాయర్ సబ్మెర్జర్ భూములకు అందిస్తోంది. సబ్మెర్జర్కోసం 472 ఎకరాలు సేకరించగా, ఇందులో తాజాగా 352 ఎకరాలకు పరిహారం అందిస్తోంది. 930 సర్వే నెంబర్ల నుంచి సేకరిస్తున్న ఈ భూమికి రూ. 88.84 కోట్లను ప్రభుత్వం విడదల చేసింది. ఈ మొత్తాన్ని నిర్వాసితులకు గురువారం అందించారు.
మూడో విడతకు ప్రపోజల్స్…
మూడో విడతలో 120 ఎకరాలకు పరిహారం అందించడానికి ఇప్పటికే ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపించారు. 385 సర్వే నెంబర్ల నుంచి సేకరించిన ఈ భూమికి రూ.32.75 కోట్లు పరిహారం త్వరలోనే అందనుంది. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే వేల ఎకరాలకు
సాగు నీరు అందనుంది.
గంధమల్లను ఏడాదిలో పూర్తి చేస్తం.. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదాద్రి, వెలుగు : గంధమల్ల రిజర్వాయర్‌ను ఏడాదిలోగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
యాదాద్రి కలెక్టరేట్లో రిజర్వాయర్‌కు భూములు ఇస్తున్న ఇందిరానగర్, గంధమల్ల గ్రామాలకు చెందిన నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందించి మాట్లాడారు. నిర్వాసితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి హక్కులు, ప్రయోజనాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకటించిన పరిహారం పూర్తిగా అందించిన తర్వాతే గంధమల్ల పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు ప్రాజెక్టు నిర్మాణంలో పనులు కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
రిజర్వాయర్ పరిధిలో రూ.100 కోట్లతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీనివల్ల యువతకు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగావశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీల, ఇరిగేషన్ ఎస్ఈ రవీందర్, తుర్కపల్లి తహసీల్దార్ రవికుమార్ ఉన్నారు.