
నేరేడ్మెట్/మల్కాజిగిరి వెలుగు: డబ్బు తగాదాతో పాత సహోద్యోగినిపై కక్షగట్టిన ఓ యువకుడు, ఏఐని అడ్డం పెట్టుకుని అరాచకానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫొటోలను ఏఐ సాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన నిందితుడిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు ఆనంద కృష్ణన్ అన్బలగన్, బాధితురాలు గతంలో ఒకేచోట పని చేశారు. క్యూనెట్ లో పెట్టుబడుల తగాదాల కారణంగా అన్బలగన్ ఆమెపై పగ పెంచుకున్నాడు. బాధితురాలి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫొటోలు సేకరించాడు. వాటిని ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి, నకిలీ అకౌంట్ల ద్వారా ప్రచారం చేశాడు. అంతేకాకుండా, ఆమె ఇంటికి అపరిచితులను పంపుతూ మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడు.
బాధితురాలి ఫిర్యాదుతో సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నేరానికి వాడిన 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతరుల ఫొటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యకర కంటెంట్ ను ఫార్వర్డ్ చేయడం నేరమని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.