
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఆయన స్థానంలో తగిన ప్రత్యామ్నాయ అధికారిని నియమించాలని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా టాటా మోహన్‌రావు కేసులో సుప్రీం కోర్టు అఫ్ ఇండియా ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది హైకోర్టు. శిక్షించడంలో కాకుండా క్షమించడంలోనే చట్టం యొక్క ఔన్నత్యం ఉందని వ్యాఖ్యానించింది.
తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు సంబంధించి ఇవాళ తీర్పు ఉత్తర్వులను వెల్లడించింది. కోర్టు ఆదేశాలను గతంలో ఇచ్చిన అండర్‌టేకింగ్‌ను కమిషనర్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు హైకోర్టు స్పష్టం చేసింది. శాంతాశ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కేసులో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించి, యంత్రాలతో కూల్చివేతలు చేపట్టడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది.
ALSO READ : లాల్‌దర్వాజా బోనాలకు..2వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు
కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ఆలస్యంగా చెప్పిన క్షమాపణను నిజాయితీ లేనిదిగా భావించి తిరస్కరించింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని, చట్టబద్ధతను దెబ్బతీసే చర్య అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. చట్టం పాలన మాత్రమే కొనసాగాలి తప్ప వ్యక్తుల పాలన కాదు.. వ్యక్తుల ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి మరణఘంటిక అని ఉద్ఘాటించింది.