
2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురికి ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన అత్యంత తీవ్రమైనదని, సమాజ మనస్సాక్షిని కదిలించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నేరం అత్యంత క్రూరంగా జరిగిందని పేర్కొన్న కోర్టు.. నిందితులకు మరణశిక్ష విధించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను మాత్రం తిరస్కరించింది.
కర్కర్‌డూమా కోర్టు శుక్రవారం తాహిర్ హుస్సేన్, నాజిమ్, ఖాసిం, జావేద్, అనాస్‌కు జీవిత ఖైదు శిక్ష విధించింది. అంకిత్ శర్మ హత్య కేసులో వీరిని ఈ నెల ప్రారంభంలోనే హత్య, నేరపూరిత కుట్రతో పాటు ఇతర తీవ్రమైన అభియోగాల్లో దోషులుగా నిర్ధారించింది. శిక్ష ఖరారు సందర్భంగా న్యాయస్థానం ఈ నేరాన్ని అత్యంత తీవ్రమైన ఘటనగా అభివర్ణించింది. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన మత ఘర్షణల సమయంలో అంకిత్ శర్మ హత్య జరిగిందని కోర్టు పేర్కొంది. బాధితుడు మతానికి చెందిన వ్యక్తి కావడం వల్లే అతడిపై అత్యంత క్రూరంగా దాడి చేశారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నేరం జరిగిన తీరు అత్యంత అమానవీయంగా ఉందని, ఘటనలో కనిపించిన క్రూరత్వం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది.
అంకిత్ శర్మ మృతదేహాన్ని జంతువును ఈడ్చుకెళ్లినట్లుగా చంద్రబాగ్ పులియా వరకు లాక్కెళ్లి.. అనంతరం కాలువలో పడేశారని పేర్కొంది. బాధితుడి మృతదేహం పట్ల వ్యవహరించిన తీరు అత్యంత హేయంగా ఉందని, ఇలాంటి క్రూరత్వం అసహ్యాన్ని, ఆవేదనను కలిగిస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసు అరుదైన వాటిలో అత్యంత అరుదైన కేసు కిందకు వస్తుందని, ఐదుగురు దోషులకు మరణశిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు, ప్రాసిక్యూషన్ కోర్టును కోరాయి. కానీ నిందితులకు మరణశిక్ష విధించేందుకు అవసరమైన ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొంది. ఈ ఐదుగురిలో హింసాత్మక స్వభావం ఉందని లేదా భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని నిరూపించే ఆధారాలు రికార్డుల్లో లేవని తెలిపింది.
దోషుల్లో ఎవరికీ గతంలో నేర చరిత్ర లేదని ధర్మాసనం గుర్తించింది. క్రమశిక్షణలో ఉంచి, చట్టాన్ని గౌరవించేలా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. మరణశిక్ష విధించడంపై చట్టపరమైన నిషేధం ఏమీ లేకపోయినా.. కేవలం అక్రమ గుంపులో పాల్గొనడం లేదా నేరానికి పాల్పడడం మాత్రమే మరణశిక్షకు సరిపోదని స్పష్టం చేసింది. ఉరిశిక్ష విధించాలంటే మరింత అసాధారణమైన, తీవ్రమైన పరిస్థితులు ఉండాలని పేర్కొంది.
జూలై 13న కర్కర్‌డూమా కోర్టు తాహిర్ హుస్సేన్, నాజిమ్, ఖాసిం, జావేద్, అనాస్‌ను అంకిత్ శర్మ హత్య కేసులో దోషులుగా నిర్ధారించింది. హత్య, నేరపూరిత కుట్రతో పాటు ఇతర అభియోగాల్లో వీరిపై నేరం రుజువైనట్లు వెల్లడించింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగిగా పనిచేస్తున్న అంకిత్ శర్మ.. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల సమయంలో హత్యకు గురయ్యారు. అనంతరం ఆయన మృతదేహం సమీపంలోని ఓ కాలువలో లభ్యమైంది. ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో అత్యంత సంచలనం సృష్టించిన కేసుల్లో అంకిత్ శర్మ హత్య కేసు ఒకటిగా నిలిచింది.