Reading Time: 2 minutes
2027 World Cup Farokh Engineer Wants Rohit Sharma And Vaibhav Sooryavanshi As Indias Opening Pair

జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో కలిపి 151 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన బుడ్డోడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వైభవ్ బాగా ఆడాడని, అతడిలో అసాధారణ టాలెంట్ ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అన్నారు. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని వైభవ్‌ను వెంటనే భారత వన్డే జట్టులోకి ఎంపిక చేయాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌కు సూచించాడు. అంతేకాదు వైభవ్‌ను రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు.

ఫరూఖ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత జట్టుకు రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీ అత్యుత్తమ ఎంపిక అవుతుందని చెప్పాడు. ‘రోహిత్ ఇంకా వన్డేలు ఆడాలి. అతనితో పాటు వైభవ్ ఓపెనింగ్ చేస్తే జట్టుకు అద్భుతమైన ఆరంభాలు లభిస్తాయి. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన బ్యాటర్. అతడిని నాలుగో స్థానంలో ఆడిస్తే మిడిల్ ఆర్డర్ మరింత బలపడుతుంది. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో గిల్ ఉంటే భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా మారుతుంది’ అని చెప్పుకొచ్చారు.

వైభవ్ సూర్యవంశీకి వన్డే జట్టులో చోటు కల్పించేందుకు ఇదే సరైన సమయమని ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయపడ్డారు. ‘టీ20, వన్డేలకు పెద్ద తేడా ఉందని నేను భావించను. మంచి బంతి ఎక్కడైనా అదే విధంగా ఉంటుంది. వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్‌గా ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. అతడు జట్టుకు గెలిపించాల్సిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి మంచి ఆరంభం ఇస్తే.. మిగతా బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను నిర్మించుకునే అవకాశం ఉంటుంది’ అని వివరించాడు.

జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు అర్ధశతకాలతో వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. వైభవ్‌ను ఎక్కువగా మార్చే ప్రయత్నం చేయొద్దని కూడా ఫరూఖ్ ఇంజినీర్ సూచించారు. ‘ వైభవ్‌ సహజసిద్ధమైన ప్రతిభ కలిగిన ఆటగాడు. కొంచెం షార్ట్ లెంగ్త్ బంతి పడితే అది నేరుగా సిక్స్‌కే వెళ్తుంది. గత తప్పుల నుంచి అతడు నేర్చుకుంటున్నాడు. అయితే అతడికి ఎక్కువగా కోచింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సిరీస్ఓ జీనియస్. వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కూడా అలాంటి సహజసిద్ధమైన ఆటగాడే. వైభవ్‌కు నిరంతరం అవకాశాలు ఇస్తే భారత జట్టుకు అతడు ఎన్నో సంవత్సరాలు గొప్ప ఆస్తిగా నిలుస్తాడు’ అని ప్రశంసించారు.