Reading Time: < 1 minute
Abhishek Porel Gets Bail After 36 Days In Jail Report

Abhishek Porel Bail: ఢిల్లీ క్యాపిటల్స్‌, బెంగాల్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌కు బెయిల్‌ మంజూరైంది. అత్యాచారం, దాడి, క్రిమినల్‌ ఇంటిమిడేషన్‌ తదితర ఆరోపణలకు సంబంధించిన కేసులో గత ఆగస్టులో అరెస్టయిన పోరెల్‌.. నెల రోజులకు పైగా జైలులో ఉన్నాడు. తాజాగా అతడికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హూగ్లీ జిల్లాలో పోలీసులు గత ఆగస్టు 11న అభిషేక్‌ పోరెల్‌ను అరెస్టు చేశారు. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి.. తనతో లైంగిక సంబంధం పెట్టుకుని మోసం చేశాడని ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌లోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు. 36 రోజుల పాటు జైలులో గడిపిన అనంతరం పోరెల్‌కు చుంచురా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

కర్ణాటకకు చెందిన ఓ యువ వైద్య విద్యార్థిని జూన్‌ 23న మొగ్రా పోలీస్‌ స్టేషన్‌లో అభిషేక్‌ పోరెల్‌పై ఫిర్యాదు చేసింది. తాము సుమారు మూడున్నర సంవత్సరాలుగా రిలేషన్‌షిప్లో ఉన్నామని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది. తామిద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లామని, ఆ తర్వాత పోరెల్‌ తనను దూరం పెట్టాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను లైంగికంగా వాడుకున్నాడని వైద్య విద్యార్థిని ఫిర్యాదులో రాసుకొచ్చింది. సుమారు ఏడాదిన్నర క్రితం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఆ సమయంలో పోలీసుల జోక్యం ఉన్నప్పటికీ అప్పట్లో ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదట.

జూన్‌లో ఫిర్యాదు నమోదైన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అభిషేక్‌ పోరెల్‌ చందన్నగర్‌లోని నివాసానికి పోలీసులు పలుమార్లు వెళ్లినప్పటికీ ఆయన అక్కడ కనిపించలేదని రిపోర్టులు పేర్కొన్నాయి. దీంతో ఫిర్యాదు చేసిన యువతి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అనంతరం జూలై 20న పోరెల్‌ను అరెస్టు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించినట్లు నివేదికలు వెల్లడించాయి. కాగా పోరెల్‌ గతంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. ప్రస్తుతం బెయిల్‌ మంజూరు కావడంతో ఈ కేసులో తదుపరి న్యాయపరమైన ప్రక్రియ ఎలా సాగుతుందనేది కీలకంగా మారింది.