
Team India: ఆసియా గేమ్స్ 2026 కోసం జపాన్ బయలుదేరడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఊహించని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. జెర్సీల సైజులు మారడం నుంచి జపాన్‌లో ఆటగాళ్లకు సరిగ్గా రూమ్‌లు కేటాయించకపోవడం వరకు అనేక వివాదాలు కలకలం రేపాయి. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి జపాన్‌కు విమానమెక్కాల్సి ఉండగా, ఈ గందరగోళం బీసీసీఐ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
జెర్సీ సైజులు రివర్స్.. లగేజ్ హడావుడి:
భారత అథ్లెట్లకు దుస్తులు సరఫరా చేసే జేఎస్‌డబ్ల్యూ ఇన్‌స్పైర్ (JSW Inspire), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA), బీసీసీఐ మధ్య జెర్సీల విషయంలో తీవ్రమైన చర్చలు జరిగాయి.
* రెండేసి జెర్సీలు: టీమిండియా జపాన్‌లో రెండు రకాల జెర్సీలు ధరించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 22న జపాన్‌తో జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌కి సాధారణ కిట్, అలాగే సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆసియా గేమ్స్ కోసం అధికారిక ఆసియా గేమ్స్ జెర్సీ ధరించాల్సి ఉంది.
* జేర్సీ సైజుల తిప్పలు: భారత ఆటగాళ్లకు ఇచ్చిన దుస్తుల సైజులు తప్పుగా ఉండటంతో చివరి నిమిషంలో మార్చాల్సి వచ్చింది. మెజారిటీ ఆటగాళ్ల జెర్సీ సైజులను సరిచేసినప్పటికీ, ఇంకా కొందరికి సరైన జెర్సీలు అందలేదు.
కిట్ బ్యాగ్ పెట్టడానికి కూడా చోటు లేదే?:
* మరోవైపు జపాన్‌లోని నాగోయాలో నిర్వాహకులు చేసిన వసతి ఏర్పాట్లు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈసారి ప్రత్యేకంగా గేమ్స్ విలేజ్ ఏర్పాటు చేయకుండా అథ్లెట్లను క్రూయిజ్ షిప్‌లు, కంటైనర్లు, వేర్వేరు హోటళ్లలో ఉంచుతున్నారు.
* కనీస స్థలం లేని రూమ్‌లు: ఐఓఏ ద్వారా టీమిండియాకు కేటాయించిన గదుల్లో ఆటగాళ్ల భారీ క్రికెట్ కిట్ బ్యాగులు పెట్టుకోవడానికి కూడా స్థలం లేకపోవడంతో బీసీసీఐ షాకైంది.
* సొంతంగా స్టార్ హోటల్ బుకింగ్: తమ ఆటగాళ్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఐఓఏ ఏర్పాట్లను పక్కనబెట్టి, బీసీసీఐ జపాన్‌లో సొంత ఖర్చులతో విడిగా స్టార్ హోటల్ రూమ్‌లను బుక్ చేసేసింది. మహిళా క్రికెట్ జట్టు నిర్వాహకులు ఇచ్చిన వసతిలోనే సరిపెట్టుకున్నప్పటికీ, పురుషుల జట్టు కోసం బీసీసీఐ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 22న జపాన్‌తో టీ20 సమరం:
ఆదివారం తెల్లవారుజామున నాగోయాకు చేరుకోనున్న శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు, సెప్టెంబర్ 22వ తేదీన ఆతిథ్య జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28వ తేదీన జరిగే ఆసియా గేమ్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో పసిడి పతకం వేటను అధికారికంగా ప్రారంభించనుంది.