Reading Time: 2 minutes
Alibaba Damo Radar Ai Model Detects Diseases Cancer Ct Scans

Medical AI: అలీబాబా రీసెర్చ్ విభాగానికి చెందిన ‘డామో అకాడమీ’ వైద్య రంగంలో ఒక సంచలనాత్మక ఏఐ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘డామో రాడార్’ (Damo Radar) పేరిట విడుదల చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్, బాడీ కాంట్రాస్ట్-ఎన్‌హాన్స్డ్ సీటీ స్కాన్‌లను క్షణ్ణంగా పరిశీలించి రకరకాల వ్యాధులను, క్యాన్సర్ కణుతులను చాలా త్వరగా గుర్తిస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపులోని 18 భాగాలకు చెందిన స్కాన్‌లను పరీక్షించి, దాదాపు 150 రకాల శారీరక రుగ్మతలకు సంబంధించి 146 రకాల క్లినికల్ లక్షణాలను ఇది విశ్లేషించగలదు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. హెల్త్‌కేర్, మెడికల్ ఇమేజింగ్ రంగాల్లో ఏఐ సాంకేతికతను విస్తరించేందుకు అలీబాబా వేస్తున్న వేగవంతమైన వడిదుడుకులకు ఇది మరో మైలురాయిలా నిలిచింది.

దాదాపు 40,000 నిజమైన సీటీ పరీక్షలతో ఈ మోడల్‌ను టెస్ట్ చేయగా, 146 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించడంలో డామో రాడార్ సగటున 0.913 ఏయూసీ (AUC) స్కోర్‌ సాధించింది. మెడికల్ డయాగ్నోస్టిక్స్‌లో ఏయూసీ స్కోర్ 1కి ఎంత దగ్గరగా ఉంటే అంత ఖచ్చితత్వంతో పనిచేస్తుందని అర్థం. అంతేకాదు, వివిధ ఆసుపత్రులకు చెందిన 26 మంది రేడియాలజిస్టులతో కలిపి చేసిన అధ్యయనంలో.. ఈ ఏఐ మోడల్ 23 మంది రేడియాలజిస్టుల కంటే ప్రతిభావంతంగా పనితీరు కనబరిచింది. ఇక ఇది డాక్టర్లకు ఎంతలా ఉపయోగపడుతుంది? అనే అంశాన్ని సైతం పరిశీలించారు. రేడియాలజిస్టులు డామో రాడార్ సహాయంతో వ్యాధుల నిర్ధారణ చేసినప్పుడు రోగాలను సరిగ్గా గుర్తించలేకపోవడం (తప్పుడు నిర్ధారణలు) 10 శాతం తగ్గడంతో పాటు డయాగ్నోసిస్‌కు పట్టే సమయం 30 శాతానికి పైగా ఆదా అయింది.

ప్రసిద్ధ ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం.. కేవలం ఒకే రకమైన వ్యాధికో లేదా నిర్దిష్ట అవయవానికో పరిమితం కాకుండా, ఒకేసారి బహుళ సమస్యలను గుర్తించగల సామర్థ్యం దీనికి ఉంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ఎక్స్‌పర్ట్-లెవెల్ జనరలిస్ట్ మెడికల్ ఇమేజింగ్ మోడల్‌గా అలీబాబా అభివర్ణించింది. రాబోయే రోజుల్లో ఇతర రకాల మెడికల్ ఇమేజింగ్ విభాగాల్లో కూడా ఈ ఏఐ మోడల్ ఫౌండేషనల్ ట్రైనింగ్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డామో అకాడమీ మెడికల్ ఏఐ విభాగంలో ఇక్కడితో ఆగకుండా, ప్రాణాంతకమైన ఆర్టిక్ డిసెక్షన్స్ తో పాటు పాంక్రియాటిక్, స్టమక్, కొలొరెక్టల్ క్యాన్సర్లను ముందుగానే గుర్తించే స్క్రీనింగ్ టూల్స్‌పై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే గ్వాంగ్‌డాంగ్ జనరల్ హాస్పిటల్, ఇతర దేశీయ భాగస్వాములతో కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘కోకా ఏఐ’ (Coca AI) అనే మోడల్‌ను విడుదల చేశారు. ప్రారంభ దశలోనే కొలొరెక్టల్ క్యాన్సర్‌ను సీటీ స్కాన్ల ద్వారా పసిగట్టడంలో ఈ మోడల్ మానవ రేడియాలజిస్టుల కంటే ఎంతో మెరుగైన సెన్సిటివిటీని ప్రదర్శించింది.