
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల ప్రచారంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్న విద్యార్థి సంఘాలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ సహా పలు సంఘాల తీరును తప్పుబట్టింది. ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలు, ఉల్లంఘనలపై శుక్రవారం హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. “మీరంతా నిజంగా విద్యార్థులేనా? లింగ్డో కమిటీ సిఫార్సుల ప్రకారం ఎన్నికలు జరిగేలా చూసేందుకు సమావేశాల్లో పాల్గొంటారు.. ఆ తర్వాత ఇలాంటి పనులకు పాల్పడుతారా?” అంటూ ధర్మాసనం నిలదీసింది.
డీయూఎస్‌యూ ఎన్నికల ప్రచార సమయంలో చోటు చేసుకున్న హింస, ఇతర నిబంధనల ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారించింది. నార్త్ క్యాంపస్‌లో నంబర్ ప్లేట్లు లేని కార్లు, వాహనాలతో భారీ కాన్వాయ్‌లు తిరుగుతున్నప్పటికీ ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇలాంటి వాటికి ఎలా అనుమతిచ్చారు? అని కోర్టు ప్రశ్నించింది.