Reading Time: 2 minutes

రూ.15 లక్షల జాబ్ వదిలేసి కేఫ్ బిజినెస్.. నష్టాల నుంచి బయటపడే సలహాలు కోరిన యువతి

Caption of Image.

15 లక్షల శాలరీ ప్యాకేజీ ఉన్న కార్పొరేట్ జాబ్ ఒక రోజు గుడ్ బై చెప్పింది యువతి. ఆపై ఢిల్లీలో రద్దీగా ఉండే హడ్సన్ లేన్‌లో తన కలల కేఫ్‌ను ప్రారంభించింది. కానీ ఒక ఏడాది తిరిగేసరికి ఆ యువతికి అనుభవాల పాఠాలు, ఆర్థిక నష్టాల రూపంలో కఠినమైన నిజాలు ఎదురయ్యాయి. 21 ఏళ్ల వయసులో రిస్క్ తీసుకుని ఎంటర్‌ప్రెన్యూర్ అవతారమెత్తిన ఈ జెన్ జెడ్ యువతి.. ప్రస్తుతం తన కేఫ్ ఎదుర్కొంటున్న సవాళ్లపై రెడ్డెట్‌లో పెట్టిన పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

కేఫ్ ప్రారంభించి ఏడాది గడిచినా..
నష్టాలొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ యువతి తన జర్నీ స్టోరీని పంచుకుంది. తన కేఫ్‌లో ఫుడ్, కాఫీ రుచిగా ఉన్నప్పటికీ.. సరిపడా సీటింగ్ లేకపోవడం, దానిని మార్చడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడం పెద్ద శాపంగా మారిందని వాపోయింది. నెల వచ్చేసరికి రూ.లక్షా 20వేలు అద్దె, రూ.2 లక్షల జీతాలు, మరో 30 శాతం మేర ఇతర నిర్వహణ ఖర్చులు తలకు మించిన భారంగా మారాయని చెప్పుకొచ్చింది. 

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు ఆమె సాహసాన్ని మెచ్చుకుంటూనే మరికొందరు కేఫ్‌ను మూసేయమని సలహాలు ఇచ్చారు. మరోవైపుహోమ్ డెలివరీలను పెంచాలని, ప్రత్యేకమైన లాస్ లీడర్ ఐటెమ్స్‌తో కస్టమర్లను ఆకర్షించాలని కొందరు ప్రాక్టికల్ సలహాలు అందించారు. స్వయంగా కేఫ్ నడుపుతున్న మరో వ్యక్తి స్పందిస్తూ తాను కూడా మొదటి 3 ఏళ్లు నష్టాలు చూశానని చెప్పి ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

అయితే నెటిజన్ల నుంచి వస్తున్న నెగెటివ్ కామెంట్లు, బిజినెస్ క్లోజ్ చేయండి అనే సలహాలపై ఆ యువతి చాలా గట్టిగానే స్పందించింది. తాను తీర్పుల కోసం రాలేదని, కేవలం సహాయం కోసమే పోస్ట్ పెట్టానని స్పష్టం చేసింది. ఎవరికైనా తన సొంత కల మీద అంత త్వరగా నమ్మకం పోదని.. తాను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కేఫ్ వదులుకోనని తేల్చిచెప్పింది. కష్టాలు ఎదురైనంత మాత్రాన వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. ఈ బిజినెస్‌ను సక్సెస్ చేసి తీరుతానని ఆమె పెట్టుకున్న నమ్మకం అందరినీ ఆకట్టుకుంటోంది.

కార్పొరేట్ లైఫ్ వైభోగాన్ని వదిలి వ్యాపార రంగంలోకి దూకిన ఈ జెన్ జెడ్ యువతి ప్రయాణం నేటి యువతకు ఒక పెద్ద గుణపాఠం. వ్యాపారంలో నష్టాలు సహజమే అయినా, వాటిని ఎదుర్కొని నిలబడాలనే ఆమె తపన నిజంగా ప్రశంసనీయం. సరైన వ్యూహాలు, ఆన్‌లైన్ డెలివరీ ప్లానింగ్, ఖర్చుల నియంత్రణ ద్వారా ఆమె తన కేఫ్‌ను లాభాల బాట పట్టించగలదని ఆశిద్దాం.

©️ VIL Media Pvt Ltd.