Reading Time: < 1 minute

ఆర్టీసీ విలీన ప్రక్రియను గుర్తింపు ఎన్నికలకు ముడిపెట్టొద్దు : తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్ సూచన

Caption of Image.

ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను గుర్తింపు సంఘం ఎన్నికలకు ముడిపెట్టడం సరికాదని తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్ సూచించింది. ఈ కారణంగా విలీన ఫలాలు అందుకోకుండానే వందలాది మంది కార్మికులు రిటైర్ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజీఎస్ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షుడు రాజిరెడ్డి అధ్యక్షతన వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

ఈ సమావేశానికి వివిధ కార్మిక సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, గోలి రవీందర్, కేఎస్ పాల్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విలీనానికి ఒప్పుకున్నా గుర్తింపు ఎన్నికలకు ముడి పెట్టడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విలీనానికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించాలని, విలీన కమిటీలో అన్ని యూనియన్లకు ప్రాతినిథ్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్​రెడ్డి, రవాణాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. విలీన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, లేదంటే తెలంగాణ ఉద్యమం మాదిరిగానే ఆర్టీసీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.  

©️ VIL Media Pvt Ltd.